
విద్యుదాఘాతంతో బాలుడి మృతి
● ఎలుకలు తెచ్చిన తంటా!
ఎమ్మిగనూరురూరల్: ఎలుకలు తెంపిన విద్యుత్ వైర్లను చూడకుండా తొక్కి విద్యుదాఘాతంతో గోపికృష్ణ(13) అనే బాలుడు మృతి చెందాడు. ఈ విషాదం ఎమ్మిగనూరు పట్టణంలోని ఎద్దుల మార్కెట్ సమీపంలోని కిరాణం దుకాణంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. వెంకటేష్, పద్మావతిలకు రామకృష్ణ, గోపికృష్ణ ఇద్దరు కుమా రులు ఉన్నారు. వీరి రెండో కుమారుడు గోపికృష్ణ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. గురువారం కిరాణం దుకాణానికి వచ్చిన వారికి సరుకులు ఇస్తూ చూసుకోకుండా కిందపడి ఉన్న విద్యుత్ వైర్‌పై కాలు పెట్టాడు. షాక్ గురై కుప్పకూలిపోయాడు. తల్లిదండ్రలు వెంటనే చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. విద్యుత్ వైర్లను ఎలుకలు తెంపడంతో విషాదం చోటుచేసుకుంది. కుమారుడు మృతి చెందటంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు టౌన్ సీఐ శ్రీనివాసులు తెలిపారు.