
సురవరం స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు
● సురవరం సుధాకర్‌రెడ్డికి నివాళి అర్పించిన వివిధ రాజకీయ పార్టీల నేతలు
కర్నూలు(అర్బన్): పేద ప్రజల కోసం జరిగిన అనేక ఉద్యమాలకు సురవరం సుధాకర్‌రెడ్డి నాయకత్వం వహించారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా ఉద్యమాలు చేపడతామని వక్తలు అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ భవనంలో సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభను సీపీఐ జిల్లా అధ్యక్షులు కే గిడ్డయ్య అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ముందుగా సురవరం సుధాకర్‌రెడ్డి చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ మాట్లాడుతూ రెండు సార్లు ఎంపీగా విజయం సాధించినా సురవరం నిరాడంబరమైన జీవితాన్ని గడిపారన్నారు. ధనిక కుటుంబంలో జన్మించిన సురవరం పేదల పక్షాన నిలిచిన వామపక్ష యోధుడని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ కొనియాడారు. నేటి తరానికి సురవరం ఎంతో ఆదర్శమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్‌వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కర్నూలులో విద్యార్థి దశ నుంచే సురవరం సుధాకర్‌రెడ్డి ఉద్యమ బాట పట్టారన్నారు. అంచెలంచెలుగా ఎదిగి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పీ రామచంద్రయ్య మాట్లాడుతూ జిల్లాలోని మొలగవెళ్లి గ్రామంలో జరిగిన భూపోరాటంలో 1100 ఎకరాలను పేదలకు పంపిణీ చేయించడంలో సురవరం కీలక పాత్ర పోషించారన్నారు. సీనియర్ నాయకులు సూర్యనారాయణరెడ్డి, కే రామాంజనేయులు, ఎస్ మునెప్ప, పీ రామక్రిష్ణారెడ్డి, నాగన్న, సీపీఐ ఎంఎల్ నాయకులు సుంకన్న, బస్తిపాడు రామక్రిష్ణారెడ్డి, కేవీ సుబ్బారెడ్డి, రవిగువేరా తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న
ఎస్వీ మోహన్‌రెడ్డి

సురవరం స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు