
మాన్యం భూమిలో అక్రమ మైనింగ్
బనగానపల్లె: కూటమి ప్రభుత్వంలో పేదలు, ప్రభుత్వ భూములకే కాదు.. దేవుడి భూములకూ రక్షణ లేదు. కూటమి నేతలు దర్జాగా ఆక్రమించి యథేచ్ఛగా మైనింగ్ చేస్తున్నా అడిగేనాథుడు లేరు. మాన్యం భూమిలో అక్రమ మైనింగ్ అడ్డుకోవాలని వినతులు ఇస్తున్నా బుట్టదాఖలవుతున్నాయి. నాపరాయి మైనింగ్‌కు జిల్లాలోనే పలుకూరు ప్రసిద్ధి. గ్రామం చుట్టు పక్కల వేలాది ఎకరాల్లో నాపరాయి మైనింగ్ కొన్నేళ్లుగా జరుగుతోంది. ఈ క్రమంలో కూటమి నేతలు గ్రామంలోని రామేశ్వరస్వామి ఆలయ మాన్యం భూమిని ఆక్రమించి యథేచ్ఛగా మైనింగ్ చేస్తున్నారు. రామేశ్వరస్వామి ఆలయానికి సర్వే నంబరు 308లో నాలుగు ఎకరాల భూమి ఉంది. ఇందులో మైనింగ్ నిక్షేపాలు పుష్కలంగా ఉండటంతో అధికారపార్టీ నాయకుల కన్ను ఈ భూమిపై పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఈ భూమి ఆక్రమణకు గురైంది. ఎటువంటి అనుమతులు లేకుండానే ఆక్రమణదారులు నాపరాతి మైనింగ్ పనులు చేపడుతున్నారు. మార్కెట్‌లో ప్రస్తుతం చదరం నాపరాయి విలువ సుమారు రూ.600 ఉంది. ఈ క్రమంలో రోజుకు 40–50 చదరాల నాపరాయి ఆలయ మాన్యం భూమిలో ఉత్పత్తి అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా నెలకు సుమారు రూ.10 లక్షల వరకు నాపరాయి విక్రయం ద్వారా ఆక్రమణదారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఆలయ మాన్యం భూమిలో అక్రమ మైనింగ్‌పై ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఆలయ ప్రధాన అర్చకులు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.
రక్షణ ఒట్టి మాటలేనా..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేవదాయ శాఖ భూములకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకుంటుందని, ఆలయ భూములు భగవంతుడి భూములుగా భావించాలని, దేవదాయశాఖ భూముల జోలికి వెళ్తే సహించేది లేదని, ఆక్రమణ భూములు వెనక్కి తీసుకుంటామని ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సభల్లో భారీ ఉపన్యాసాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఆక్రమణలకు పాల్పడుతున్నా అడిగేవారు లేరు. పలుకూరులో అక్రమ మైనింగ్ విషయం దేవదాయ, మైనింగ్ శాఖ అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దేవుడి భూమికే రక్షణ లేకపోతే ఎలా అంటూ గ్రామస్తులు విమర్శిస్తున్నారు.
యథేచ్ఛగా కూటమి నేతల
తవ్వకాలు
అధికారులకు ఫిర్యాదు చేసినా
పట్టించుకోని వైనం

మాన్యం భూమిలో అక్రమ మైనింగ్