
ఆదోనిలో రెండిళ్లలో చోరీ
● తులం బంగారం, 4.5 కేజీల వెండి, రూ.8 వేలు నగదు అపహరణ
ఆదోని అర్బన్: పట్టణ శివారు కాలనీలో బుధవారం తెల్లవారుజామున రెండు ఇళ్లల్లో చోరీ జరిగింది. స్థానిక రాజీవ్‌గాంధీ నగర్‌కు చెందిన పార్వతమ్మ అనే మహిళ మంగళవారం వర్షం కురవడంతో ఇంటికి తాళం వేసి చెల్లెలి ఇంటికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దుండగులు ఆ ఇంట్లోకి దూరి బీరువా తాళాలను పగలగొట్టి అర తులం బంగారం, రూ.6 వేలు నగదును దొంగలించారు. అందులో కుమారుడికి పదో తరగతిలో అత్యధిక మార్కులు వచ్చినందుకు బహుమతిగా ఇచ్చిన బంగారు పతకం కూడా ఉంది. అదే కాలనీకి చెందిన రంగమ్మ అనే మహిళ ఆదివారం ఇంటికి తాళం వేసి తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలంకు వెళ్లింది. బుధవారం ఉదయం ఆ ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. దుండగులు ఇంట్లోని బీరువా తాళాలు పగలగొట్టి అర తులం బంగారు కమ్ములు, నాలుగున్నర కేజీల వెండి, రూ.2 వేలు నగదు దోచుకెళ్లినట్లు తెలిసింది. స్థానికులు బుధవారం ఉదయం రెండిళ్ల తాళాలు పగలగొట్టి ఉండటాన్ని చూసి వెంటనే యజమానులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి విచారణ జరుపుతామని వెల్లడించారు.