
పచ్చదనంపై గొడ్డలి వేటు!
కర్నూలు సిటీ: స్థానిక ప్రభుత్వ (టౌన్ మోడల్) జూనియర్ కాలేజీ ఆవరణలోని పచ్చని చెట్లను అధికారులు తొలగించారు. చెట్లు కాలేజీ భవనం పైభాగానికి పాకాయని, కింది కొమ్మలు ఎండిపోయి రాకపోకలకు అంతరాయం కలుగుతుందనే కారణాలతో పచ్చని నీడనిచ్చే చెట్లను నరికివేసేందుకు నిర్ణయించారు. ఓ టింబర్ డిపోకు పని అప్పగించగా రూ.1500 కూలీ, భోజనం ఖర్చులు ఇచ్చేలా అంగీకారం కుందిరింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కాలేజీ ప్రధాన భవనం కుడి వైపు ఉన్న పెద్ద చెట్లు ఐదు, మధ్యస్థంగా ఉండే చెట్లు రెండు, లెక్చర్ హాల్ అండ్ అడిటోరియం భవనం ముందున్న రెండు చెట్లు, మరికొన్ని చెట్ల కొమ్మలను కోత మిషన్, గొడ్డళ్లతో నరికేశారు.
వాల్టా చట్టానికి తూట్లు
వాల్టా చట్టం ప్రకారం నది పరివాహక ప్రాంతాల్లో తవ్వకాలు, చెట్ల నరివేతకు పాల్పడడం నేరం అవుతుంది. అభివృద్ధి నిమిత్తం ప్రభుత్వ స్థలాల్లో పెంచిన చెట్లను తొలగించాలంటే ముందుగా తహసీల్దారు, ఫారెస్ట్ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. టౌన్ మోడల్ కాలేజీ ఆవరణలోని చెట్లను కొట్టేసేందుకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలుస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై ఒక్కో చెట్టుకు రూ.10 వేల వరకు జరిమానా విధించి కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అభివృద్ధి కమిటీ తీర్మానంతోనే..
నేను టౌన్ మోడల్ కాలేజీకి రెండు నెలల క్రితం ప్రిన్సిపాల్‌గా వచ్చాను. కాలేజీని అభివృద్ధి చేసేందుకు డెవలప్‌మెంట్ కమిటీ సమావేశంలో చేసిన తీర్మానాల మేరకు భవనం పైభాగానికి పాకిన కొమ్మలు, రెండు ఎండిన చెట్లు, వేర్లు భవనం పునాదుల్లోకి చొచ్చుకుపోయిన చెట్లు, అడ్డంగా ఉన్న చెట్లను తొలగించాం. కొమ్మలు కిందికు ఉండడంతో ఇటీవల ఓ విద్యార్థికి దెబ్బలు తగిలాయి. నరికేసిన చెట్ల స్థానంలో పూల మొక్కలు నాటించేందుకు చర్యలు తీసుకుంటాం. – పద్మావతి,
టౌన్ మోడల్ కాలేజీ ప్రిన్సిపాల్

పచ్చదనంపై గొడ్డలి వేటు!