
విజ్ఞాన దర్శిని.. పుస్తకం...
● పుస్తకాన్ని ప్రేమిద్దాం... విజ్ఞానాన్ని దోచేద్దాం... ● మానవుని పురోగమనంలో పుస్తకాలది మహత్తర పాత్ర ● పుస్తక పఠనంతోనే సంపూర్ణ పరిజ్ఞానం ● ఆధునిక సాంకేతికతతో తగ్గుతున్న పుస్తక పఠనం ● పుస్తక పఠనాన్ని ఖచ్చితం చేయాలంటున్న మేధావులు ● నేడు పుస్తక ప్రేమికుల దినోత్సవం
కర్నూలు కల్చరల్: పుస్తక పఠనంతో సంపూర్ణ పరిజ్ఙానం సిద్ధిస్తుంది. పుస్తకాల అధ్యయనం ఒక తపన. తీరని విజ్ఙాన దాహం. పుస్తకాలకు పుస్తక ప్రియులకు ఉండే అనుబంధం బలీయమైంది. పుస్తకాన్ని తమ జీవితాన్ని ఆదర్శంగా ముందుకు నడిపించే నిజమైన స్నేహితుడిగా.. మార్గదర్శకుడిగా భావిస్తారు. కొత్త పుస్తకం వచ్చిందంటే ఇంట్లో గ్రంథాలయంలో ఉండాల్సిందే. ఆర్థిక స్తోమత లేక కొన్ని పుస్తకాలు కొనలేకపోయినా ఏ గ్రంథాలయంలోనో స్నేహితుల వద్దో సంపాదించి చదివేదాక వారికి నిద్ర పట్టదు. ఇలాంటి గొప్ప అనుబంధాన్ని పెంచుకున్న పుస్తక ప్రియుల కోసం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ‘పుస్తక ప్రేమికుల దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. అయితే నేటి ఆధునిక సాంకేతి పరిజ్ఙానం పరుగుల్లో పుస్తక పఠనం బాగా తగ్గిపోయిందని.. ఇది సమాజంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుస్తక పఠనం పెంచేలా చర్యలు చేపట్టాల్సి ఉందని అభిప్రాయ పడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలులో జిల్లా కేంద్ర గ్రంథాలయం ఒకటి, 58 గ్రంథాలయ శాఖలు, ఒకటి గ్రామీణ గ్రంథాలయం ఉంది. సుమారు 150 పుస్తక సంక్షిప్త కేంద్రాలు ఉన్నాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయంతో పాటు ఇతర గ్రంథాలయాల్లో 6,50,400 పుస్తకాలు ఉన్నాయి. కేంద్ర గ్రంథాలయంలో 10 వేల మంది, మిగతా వాటిల్లో 70 వేల మంది శాశ్వత సభ్యులు ఉన్నారు. కేంద్ర గ్రంథాలయంలో ప్రతి రోజు సుమారు 450 మంది పఠనం చేస్తుంటారు.