
నమో.. రాఘవేంద్రాయా!
● వైభవంగా ప్రారంభమైన
రాఘవేంద్రుల సప్తరాత్రోత్సవాలు
● ధ్వజారోహణతో ఉత్సవాలు
ప్రారంభించిన శ్రీమఠం పీఠాధిపతి
శ్రీసుబుధేంద్రతీర్థులు
మంత్రాలయం: వేదభూమి వేదఘోషతో మార్మోగుతుండగా.. మంగళవాయిద్యాల సుస్వరాలు ఆలపిస్తుండగా.. భక్తజనం నీరాజనాలు పలుకుతుండగా దైవాంశ సంభూతుడు రాఘవేంద్రస్వామి మఠం శిఖరాన ధ్వజం ఎగిరింది. అమరగుడి ఉత్సవాలకు అంకురార్పణ శంఖం పూరించింది. దైవాంశ సంభూతుడు శ్రీరాఘవేంద్రుల 354వ సప్తరాత్రోత్సవాలు శుక్రవారం వైభవోపేతంగా మొదలయ్యాయి. శ్రీమఠం పీఠాధిపతి శ్రీసుబుధేంద్రతీర్థులు అమృత హస్తాలతో శ్రీమఠం శిఖరాగ్రన స్వర్ణ బృందావన ధ్వజారోహణ చేశారు. ఉత్సవాలు ప్రారంభం కావడంతో రాఘవేంద్రస్వామి మూల బృందావనం నుంచి పీఠాధిపతులు ఊరేగింపుగా ఆలయ ముఖధ్వారం ముంగిటకు చేరుకున్నారు. గోపూజ, అశ్వపూజ నిర్వహించి ధ్వజారోహణ గావించారు. ధ్వజారోహణ వేళ భక్తజనం ‘నమో.. రాఘవేంద్రా’ అంటూ స్వరించారు. అనంతరం కార్యనిర్వాహణ కార్యాలయం చేరుకుని లక్ష్మీపూజ, ఏఏఓ, మేనేజర్, జోనల్‌మేనేజర్ తదితర కౌంటర్లలో పూజలుచేశారు. యోగీంద్ర మంటపంలో రాఘవేంద్రుల మైనపు విగ్రహానికి పుష్పార్చన, మంగళ హారతులు పట్టి జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రాంగణ వీధుల్లో అశేషభక్తజనం మధ్య ప్రభోత్సవం అంగరంగవైభవంగా జరిగింది.
పరిమళ తీర్థం పుష్కరిణి ప్రారంభం
శ్రీమఠం చరిత్రలో తొలిసారిగా రాఘవేంద్రస్వామికి తెప్పోత్సవం జరగనుంది. ఉత్సవ నిర్వహణ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన ఎంఆర్‌జీ గ్రూపు సీఈవోలు ఆశా ప్రకాష్, శ్రీప్రకాశ్ శెట్టి సహకారంతో రూ.3.8 కోట్ల వ్యయంతో పరిమళ తీర్థం పుష్కరిణి నిర్మించారు.. శ్రీమఠం ఈశాన్య భాగంలో ఏర్పాటు చేసిన పుష్కరిణిని పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. అలాగే భక్తుల సహకారంతో మూల బృందావన మంటప స్తంభాలకు బంగారు కవచధారణను ఆవిష్కరించారు. రూ. రూ.40 లక్షలతో నిర్మించిన కవీంద్ర నిలయ డార్మిటరీ, రూ.65లక్షలతో నిర్మించిన వాగీశ డార్మిటరీ, బెంగళూరు వాసులు ఏర్పాటు చేసిన డిజిటల్ లాకర్ సముదాయాలను ప్రారంభించారు. ఉత్సవాల్లో మఠం ఏఏవో మాధవ శెట్టి, మేనేజర్–1 శ్రీనివాసరావు, మేనేజర్–2 వెంకటేష్‌జోషి, జోనల్‌మేనేజర్ శ్రీపతిఆచార్, ధార్మిక సహాయకాధికారి వ్యాసరాజాచార్, ధ్వారపాలక అనంతస్వామి, సంస్కృత పాఠశాల ప్రధానాచార్యులు వాదీరాజాచార్ పాల్గొన్నారు.

నమో.. రాఘవేంద్రాయా!

నమో.. రాఘవేంద్రాయా!