
జలుబు చేస్తే.. జ్వరం వస్తే.. విపరీతమైన నొప్పులు బాధిస్త
● ఇష్టానుసారంగా ఆర్‌ఎంపీల వైద్యం ● ఇటీవల నందికొట్కూరులో మహిళకు అబార్షన్ ● గత నెలలో కల్లూరులో ఓ మహిళకు వికటించిన వైద్యం ● తరచూ జిల్లాలో ఎక్కడో చోట ఇలాంటి ఉదంతాలు ● పట్టించుకోని వైద్య ఆరోగ్య శాఖ
కర్నూలు(హాస్పిటల్): ఆర్‌ఎంపీలు చేస్తున్న వైద్యానికి అమాయకులైన పేదల ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. వెళ్లిన వెంటనే పనైపోతుందని, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో వారు ఆర్‌ఎంపీల వద్ద చికిత్స చేయించుకుంటున్నారు. అర్ధరాత్రి అయినా వీరు అందుబాటులో ఉండటం, ఏ రోగమైనా రెండు ఇంజెక్షన్లు వేస్తే తగ్గిపోతుందని ప్రజల్లో నమ్మకం బలంగా ఏర్పడటంతో ప్రజలు ఆర్‌ఎంపీలను నమ్ముకుంటున్నారు. అధిక శాతం అప్పటికప్పుడు వ్యాధి నయం అవుతున్నా...కొందరికి భవిష్యత్తులో, మరికొందరికి కొన్ని రోజుల తర్వాత రియాక్షన్ వస్తోంది. ఇలాంటి వారు చివరి దశలో నిపుణులైన వైద్యుల వద్దకు చికిత్స చేయించుకుంటున్నారు. నకిలీ వైద్యుల చికిత్సతో సైడ్‌ఎఫెక్ట్ వచ్చి మెరుగైన వైద్యం కోసం వచ్చే వారి సంఖ్య కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోజురోజుకూ పెరుగుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఐదు వేల మందికి పైగా ఆర్‌ఎంపీలు రోగులకు చికిత్స అందిస్తున్నారు. వీరి నిర్వహించే క్లినిక్‌లకు ఎలాంటి అనుమతులు ఉండవు. అవసరమైన మందులు, వైద్యపరీక్షల పరికరాలు, స్కానింగ్ మిషన్లు వీరి వద్ద ఉన్నా కూడా ఎవ్వరూ అడగరు. ఇలాంటి అనుమతి లేని ఆసుపత్రుల కారణంగా ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
నాడు మారుమూల పల్లెకూ వైద్యం
ప్రజలకు నిపుణులైన వైద్యనిపుణులు అందుబాటులో ఉండేందుకు గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతా ల్లో విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేసింది. గ్రామీ ణ ప్రాంత ప్రజలకు ఎలాంటి అనారోగ్యం వచ్చినా ప్రథమ చికిత్స కోసం వీటిని సంప్రదించేలా చర్యలు తీసుకుంది. అక్కడ ప్రాథమిక వైద్యపరీక్షలతో పాటు బీఎస్సీ నర్సింగ్ చదివిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు జిల్లా లో 450లకు పైగా విలేజ్‌హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటయ్యా యి. వీరి స్థాయికి మించిన వ్యాధి వస్తే ముందుగా పీహెచ్‌సీల్లోని వైద్యాధికారిని సంప్రదిస్తారు. వారికీ అర్థం గాకపోతే టెలిమెడిసిన్ ద్వారా కర్నూలు జీజీహెచ్, నంద్యాల జీజీహెచ్‌లలోని టెలిమెడిసిన్ వైద్యులకు వీడియో కాల్ ద్వారా కలిసి రోగికి ఉన్నచోటే అవసరమైన వైద్యాన్ని అందించేలా ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా రోగి వద్దకే వైద్యులు వచ్చి చికిత్స అందించేవారు. ఆరోగ్య రక్ష కార్యక్రమం ద్వారా ఊళ్లోనే వైద్యశిబిరాలు ఏర్పా టు చేసి చికిత్స అందించేవారు. అలాగే పట్టణాల్లో మురికివాడల్లో సైతం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మరింతగా పెంచి అక్కడ ఎంబీబీఎస్ చదివి న వైద్యులను నియమించారు. బేసిక్ వ్యాధులన్నింటికీ అక్కడ వైద్యపరీక్షలు నిర్వహించేలా ఏర్పాటు చేశారు. అవసరమైన ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టులు సైతం ఇక్కడ ఉన్నారు. మురికివాడల్లోని పేదలు ఆర్‌ఎంపీల వద్దకు వెళ్లకుండా ఇక్కడే వారికి ప్రాథమిక స్థాయి వైద్యం అందుబాటులోకి తెచ్చారు.
అల్లోపతి వైద్యుల ఖర్చుకు భయపడి!
వైద్యం ప్రస్తుత పరిస్థితుల్లో భారంగా మారింది. పట్టణాల్లోని వైద్యుల వద్దకు జ్వరం వచ్చిందని వెళ్లినా రూ.3వేల నుంచి రూ.5వేల దాకా ఖర్చు వస్తోంది. పెద్దరోగమైతే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అందుకే ఏ చిన్నరోగమొచ్చినా మందుగా ఆర్‌ఎంపీలనే ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్‌ఎంపీలు తెలిసీ తెలియని వైద్యంతో వారికి చికిత్స చేసి ప్రాణాల మీదుకు తీసుకొస్తున్నారు. కొందరు సైలెన్‌లు(ఫ్లూయిడ్స్) ఎక్కించడంతో పాటు ప్రసవాలు, అబార్షన్లు, స్కానింగ్, మైనర్ సర్జరీలు నిర్వహిస్తున్నారు. కర్నూలు, కోడుమూరు, గూడూరు, ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు వంటి ప్రాంతాల్లో ఆసుపత్రులు కూడా తెరిచి ఆర్‌ఎంపీలు వైద్యం చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
మృతులు వీరే..
విచ్చలవిడిగా ఆర్‌ఎంపీల వైద్యం
గ్రామాల్లో సాయంత్రం దాటితే విలేజ్ హెల్త్ క్లినిక్‌లో కమ్యూనిటీ ఆఫీసర్లు, యుపీహెచ్‌సీల్లో వైద్యాధికారులు అందుబాటులో ఉండటం లేదు. ప్రజలు ఉదయం పనులకు వెళ్లిన సాయంత్రం మాత్రమే ఇళ్లకు చేరుకుంటారు. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. వైద్యం చేయడానికి వీరికి ఎలాంటి అర్హత లేకపోయినా రోగులకు చికిత్స చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కర్నూలులోని పలు ప్రాంతాల్లో కొందరు ఆర్‌ఎంపీలు ఇష్టానుసారం వైద్యం చేస్తున్నారు. గూడూరు, కోడు మూరు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూ రు, కౌతాళం, హాలహర్వి, ఆలూరు మండలాల్లో 5వేల మందికి పైగా ఆర్‌ఎంపీలు ఉన్నారు.
గడివేముల మండలం గని గ్రామానికి చెందిన శివమ్మ కుమార్తె శ్రీవాణి గత నెల 28న నందికొట్కూరు పట్టణంలోని గీతారాణి అనే మహిళకు ఆర్‌ఎంపి వద్ద అబార్షన్ చేయించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో 30వ తేదీన ఆమె మృతి చెందారు. ఆమెకు కర్నూలులోని కొత్తబస్టాండ్ వద్ద ఉన్న ఓ హాస్పిటల్‌లో లింగనిర్ధారణ చేసినట్లు సమాచారం. శనివారం వరకు ఆ స్కానింగ్ సెంటర్‌ను అధికారులు తనిఖీ చేయని పరిస్థితి నెలకొంది.
కర్నూలు నగరంలోని కల్లూరు ప్రాంతానికి చెందిన ఓ మహిళకు జ్వరం రావడంతో స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీ ఇంజెక్షన్లు ఇచ్చారు. అవి వికటించి ఆమె మృతి చెందారు.
కౌతాళానికి చెందిన రాణమ్మకు కీళ్లనొప్పి ఉండటంతో స్థానికంగా ఉన్న ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ఆమెకు వరుసగా మూడు రోజుల పాటు ఇంజెక్షన్లు ఇవ్వడంతో వికటించి మృతిచెందారు.
పత్తికొండ పట్టణానికి చెందిన వై.రంగస్వామి(35) ఛాతీలో మంటగా ఉండటంతో గత నెల 30న స్థానికంగా ఉన్న ఒక క్లినిక్‌కు వెళ్లగా అసిస్టెంట్ వైద్యం చేశాడు. ఇంటికి వెళ్లిన వెంటనే రంగస్వామి ప్రాణాలు కోల్పోయాడు.
గత ఏడాది గోనెగండ్ల మండలం గంజిహల్లి గ్రామంలో రాజేష్(12) జ్వరం రావడంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీని సంప్రదించారు. అతను బాలునికి ఇంజెక్షన్ వేయడంతో అక్కడ గడ్డ ఏర్పడింది. దాని నుంచి చీము, రక్తం కారడంతో ఆసుపత్రిలో చేరగా కోలుకోలేక మృతి చెందాడు.
చర్యలు తీసుకుంటాం
ఆర్‌ఎంపీలు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. కనీసం ఇంజెక్షన్ కూడా వేయకూడదు. సర్జరీలు, ప్రసవాలు, అబార్షన్లు అసలే చేయకూడదు. ఎంబీబీఎస్ చదివిన వారు మాత్రమే అల్లోపతి వైద్యం చేయాలి. ఇతరులు వైద్యం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. ఇకపై జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక దాడులు నిర్వహిస్తాం. స్థానికంగా విచారణ చేసి వారిపై చర్యలు తీసుకుంటాం.
–డాక్టర్ పి.శాంతికళ,
డీఎంహెచ్‌ఓ, కర్నూలు
శ్రీవాణి (ఫైల్)

జలుబు చేస్తే.. జ్వరం వస్తే.. విపరీతమైన నొప్పులు బాధిస్త

జలుబు చేస్తే.. జ్వరం వస్తే.. విపరీతమైన నొప్పులు బాధిస్త