కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ పరిధిలో నలుగురికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలను కల్పించి వివిధ కార్యాలయాలకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. జెడ్పీలో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు కారుణ్య నియామకాల కింద మృతిచెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యో గం కల్పించామన్నారు. జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి మాట్లాడుతూ.. జెడ్పీ యాజమాన్య పరిధిలోని ఆయా కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న కార్యాలయ సహాయకుల పోస్టుల్లో వీరిని నియమించామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగాలు పొందిన వారిలో బీ నీరజాబాయి (జెడ్పీహెచ్‌ఎస్, నొస్సం, సంజామల మండలం), పీ శేఖర్ (ఎంపీపీ, ఓర్వకల్లు ), ఎన్ రమాదేవి (పీఆర్ పీఐయు డివిజన్, నంద్యాల), ఎస్ విజయకుమారి (జెడ్పీహెచ్‌ఎస్, గార్గేయపురం) ఉన్నారు.
జీడీపీ నుంచి నీరు విడుదల
గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ) నుంచి కుడి, ఎడమ కాలువలకు నీరు విడుదల చేసినట్లు ఏఈ మహమ్మద్ ఆలీ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టుకు 110 క్యూసెక్కుల నీరు వస్తోందని, కుడి కాలువకు 100 , కోడుమూరు పట్టణానికి తాగునీటి కోసమని ఎడమ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. జీడీపీ నిల్వ సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా ఆదివారం సాయంత్రానికి ఒక టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు చెప్పారు.
బోధనలో మెలకువలు అవసరం
కర్నూలు(సెంట్రల్): విద్యా బోధనలో ఉపాధ్యాయులు నిరంతరం మెలకువలు నేర్చుకోవాలని సమగ్ర శిక్ష అభియాన్ అదనపు రాష్ట్ర పథక సంచాలకులు డాక్టర్ ప్రసన్నకుమార్ సూచించారు. ఆదివారం రాఘవేంద్ర బీఈడీ కాలేజీలో తొమ్మిది జిల్లాల కేజీబీవీ పీజీటీలకు ఇన్ సర్వీసు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతను ముఖ్యఅ అతిథిగా హాజరై మాట్లాడుతూ.. కేజీబీవీల్లో పేద విద్యార్థినులు ఉంటుండడంతో వారి వ్యక్తిగత పరిస్థితులను తెలుసుకోని బోధన చేయాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులకు ఆరుగురు రిసోర్స్‌పర్సన్‌లు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డీఈఓ శామ్యూల్‌పాల్, జీసీడీఓలు సువర్చల, స్నేహలత పాల్గొన్నారు.
సీమ ప్రాజెక్టులకు పూర్తిస్థాయి నీటిని విడుదల చేయాలి
నంద్యాల(అర్బన్): రాయలసీమ ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. తెలుగుగంగ, గాలేరునగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు నేటికి పూర్తి కాకపోవడం, పంట కాల్వలు లేకపోవడంతో ప్రాజెక్టుల కింద ఉన్న లక్షలాది ఎకరాలకు నేటికి సాగునీరు అందలేదన్నారు. వాస్తవ పరిస్థితి ప్రపంచానికి తెలియజేసేందుకు ఆలోచన పరుల వేదిక నాయకులు విశ్రాంత ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు నేతృత్వంలో రైతు సేవా సంస్థ అధ్యక్షుడు భవానీప్రసాద్ సాగునీటి రంగ విశ్లేషకులు లక్ష్మీనారాయణ, సామాజిక వేత్త రామారావు రాకపై ఆదివారం స్థానిక కార్యాలయంలో ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టులకు సాధారణం కంటే నెల రోజుల ముందే వరదలు వచ్చినా సీమ ప్రాజెక్టులకు ప్రభుత్వం నీటిని విడుదల చేయలేదన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నీటిని దిగువకు విడుదల చేయడం అన్యాయమన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా గాలేరునగరి, ఎస్సార్బీసీ, తెలుగుగంగ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు వైఎన్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, వెంకటేశ్వరనాయుడు, సుధాకర్‌కుమార్, అసదుల్లా, భాస్కరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీలో నలుగురికి కారుణ్య నియామకాలు
జెడ్పీలో నలుగురికి కారుణ్య నియామకాలు