
మిక్సీలు, స్టవ్‌లు రిపేర్ చేస్తానంటూ చోరీలు
● దొంగను అరెస్టు చేసిన పోలీసులు ● బంగారు, వెండి నగలు స్వాధీనం
ప్యాపిలి: మిక్సీలు, గ్యాస్ స్టవ్‌లు రిపేరు చేస్తానని సైకిల్‌పై గ్రామాల్లో తిరుగుతూ ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు అపహరించేవాడు. వాటిని విక్రయించి సొమ్ము చేసుకుని గోవా తదితర ప్రాంతాల్లో జల్సాలు చేసేవాడు. ఈ దొంగను, అతనికి సహకరించిన వ్యక్తిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. ప్యాపిలి సర్కిల్ కార్యాలయంలో సీఐ వెంకటరామిరెడ్డి, జలదుర్గం ఎస్‌ఐ నాగార్జున ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా యాడికి పట్టణానికి చెందిన జోగి రాజ అలియాస్ రాజ కుళ్లాయప్ప, గుత్తి మండలం తొండపాడు గ్రామానికి చెందిన మునగాల సుంకన్నను బావిపల్లి క్రాస్ రోడ్డు వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి నుంచి ఐదు తులాల బంగారు నగలు, 10 తులాల వెండి కాళ్ల పట్టీలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపామనానరు. జోగి రాజు.. హుసేనాపురం గ్రామంలో రెండు ఇళ్లలో, మామిళ్లపల్లి గ్రామంలోని ఒక ఇంటిలో గత రెండు, మూడు నెలల క్రితం చోరీకి పాల్పడినట్లు తెలిపారు. అపహరించిన సొమ్ములో కొంత సొమ్మును విక్రయించడానికి మునగాల సుంకన్నకు ఇచ్చినట్లు వెల్లడించారు. జోగి రాజు మిక్సీలు, గ్యాస్ స్టవ్‌లు రిపేరు చేస్తానని సైకిల్‌పై తిరుగతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించి దొంగతనాలకు పాల్పడేవాడని తెలిపారు. అపహరించిన నగలను విక్రయించి వచ్చిన సొమ్ముతో గోవా తదితర ప్రాంతాల్లో జల్సాలు చేసేవాడని తెలిపారు. గతంలో జోగి రాజుపై తాడిపత్రి టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కూడా కేసులు నమోదైనట్లు తెలిపారు. కేసు ఛేదించిన ఎస్‌ఐ నాగార్జున, హెడ్ కానిస్టేబుల్ నీలకంఠ, పీసీలు మాధవరెడ్డి, వెంకటరాజు, మాదన్న, నరసయ్య, మద్దిలేటి, అశోక్‌కుమార్, హోంగార్డులు హుసేన్‌బాష, మహబూబ్ బాషాలను సీఐ అభినందించారు.