
నంద్యాల డయాసిస్ బిషప్‌గా రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావు
నంద్యాల(న్యూటౌన్)/కర్నూలు (టౌన్): చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా నంద్యాల అధ్యక్ష ఖండం పీఠాధిపతి(బిషప్)గా రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావును నియమించినట్లు నంద్యాల డయాసిస్ సెక్రటరీ స్టాండ్లీ విలియమ్స్ ఆదివారం పేర్కొన్నారు. గత ఏడాది ఏప్రిల్ 11వ తేదీన నంద్యాలలో జరిగిన బిషప్ ఎన్నికల్లో నలుగురు బిషప్ అభ్యర్థులుగా విజయం సాధించారు. వీరిలో రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావును చైన్నెలోని మోడరేటర్ కార్యాలయంలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మోడరేటర్ రూబెన్‌మార్క్ అధ్యక్షతన ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. దాదాపు ఏడాది నుంచి పెండింగ్‌లో ఉన్న బిషప్ ఎంపిక ప్రక్రియ నేటితో ముగిసింది. దీంతో నంద్యాల డయాసిస్ పరిధిలోని సంఘాల పాస్టరేట్ చైర్మన్లు, హోలీక్రాస్ కెథడ్రల్ పాస్టరేట్–1, 2, 3, 4, 5, 6 గురువులు హర్షం వ్యక్తం చేశారు. నంద్యాల అధ్యక్ష ఖండం పీఠాధిపతులుగా నియమితులు కావడంతో పరిపాలన సౌలభ్యం ముందుకు సాగుతుందన్నారు. హోలీక్రాస్ కెథడ్రల్ చర్చి డీనరీ చైర్మన్ కొత్త మాసి జోసెఫ్, ఇమ్మానియేల్, నందం ఐజక్, విజయ్‌కుమార్, సంజీవ్‌కుమార్, పాస్టరేట్–1 సెక్రటరీ ప్రభుదాసుతో పాటు కమిటీ సభ్యులు, పాస్టరేట్–2 బాలయ్య, కిరణ్‌కుమార్, కమిటీ సభ్యులతో పాటు ఆయా సంఘాల కాపర్లు, కమిటీ పెద్దలు, క్రైస్తవులు నంద్యాల అధ్యక్ష ఖండం బిషప్ ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేశారు.
5న పట్టాబిషేకం
గత బిషప్‌గా ఉన్న పుష్పాలలిత పదవీ విరమణ చెందడంతో నూతన బిషప్‌గా రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావును ఎంపిక చేశారు. ఈయన వైఎస్సార్ జిల్లా ముద్దనూరులో పాస్ట్రేట్‌లో డినరీ చైర్మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కర్నూలులోని చిల్డ్రన్స్ పార్కు సీఎస్‌ఐ చర్చి ప్రాంగణంలో రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావును అభినందించారు. ఈనెల 5వ తేదీ నంద్యాల కేథడ్రల్ చర్చిలో సంతోష్‌కు బిషప్ పట్టాభిషేకం జరుగుతుందని చర్చి నిర్వాహకులు తెలిపారు.