
ఇళ్లపై కూలిన విద్యుత్ స్తంభాలు
● తెగిన విద్యుత్ లైన్లు
ఆదోని అర్బన్: రాయచోటి నుంచి నెల్లూరుకు ఆదోని మీదుగా వెళ్తున్న కంటైనర్ లారీ ఎల్‌బీ లైన్‌ను ఢీకొట్టింది. దీంతో మూడు విద్యుత్ స్తంభాలు ఇళ్లపైన కూలాయి. విద్యుత్ లైన్లు తెగిపడ్డాయి. ఆ సమయంలో కాలనీవాసులు, ఆ రోడ్డున వెళ్లే పాదచారులు, వాహనదారులు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం మరమ్మతులు చేపట్టారు. కాలనీలో ఒకచోట విద్యుత్ స్తంభం పక్కకు ఒరిగి ఇంటిపై పడింది. మరో రెండు స్తంభాలు ఒరిగి విద్యుత్ లైన్లన్నీ కిందకు పడిపోయాయి. ఒక్కసారిగా విద్యుత్ స్తంభాలు ఒరగడంతో పెద్ద శబ్దం రావడంతో కాలనీవాసులు భయబ్రాంతులకు గురయ్యారు. ఎంఎం కాలనీకి విద్యుత్ అధికారులు ఎల్‌బీ లైన్ ఏర్పాటు చేసేటప్పుడు రోడ్డు ఉందని తెలిసినా కూడా ఎత్తులో పోల్ వేయలేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని కాలనీవాసులు మండిపడుతున్నారు. ప్రాణనష్టం జరిగితే ఎవరు బాధ్యులని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ ప్రధాన రహదారుల్లో పెద్ద పెద్ద వాహనాలు వెళ్తుంటాయని, అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.