
టీడీపీ నాయకుల దాష్టీకం
తుగ్గలి: అధికారంలో ఉన్నామని, తమను ఎవరూ ఏమీ చేయలేరని టీడీపీ నాయకులు దాష్టీకం చేశారు. శభాష్‌పురం గ్రామంలో కర్రలతో మహిళలపై దాడి చేశారు. పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ వర్గీయుడు తిమ్మరాజు, టీడీపీ వర్గీయుడు చక్రాల్ల రంగస్వామి మధ్య రెండు రోజుల క్రితం మద్యం విక్రయంపై వాగ్వావాదం జరిగింది. మొహర్రం పండుగ నేపథ్యంలో గ్రామంలో ఘర్షణ వద్దని పలువురు వారించడంతో సర్దుకున్నారు. పండుగ ముగియడంతో సోమవారం పికెట్ పోలీసులు టీడీపీ వర్గీయుడు రంగస్వామిని తీసుకొచ్చి పాఠశాల వద్ద ఉంచారు. విషయం తెలుసుకున్న టీడీపీ వర్గీయులు సూరన్నతో పాటు మరికొందరు కట్టెలతో హల్‌చల్ చేస్తూ తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారా అంటూ తిమ్మరాజు, సోదరుల ఇళ్ల వద్దకెళ్లి హల్‌చల్ చేశారు. భయభ్రాంతులకు గురైన తిమ్మరాజు, సోదరులు పారిపోయారు. ఇంట్లో ఉన్న తిమ్మరాజు సోదరుడు శ్రీనివాసులు భార్య సుధామణి, ఆమె తల్లి దండ్రులు(చందోలి)పై దాడి చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. పండుగ రోజు కొత్తబురుజుకు చెందిన మేలగాడి అన్నం పెడుతుండగా టీడీపీ వర్గీయులు అనవసరంగా దుర్భాషలాడుతూ ఘర్షణ సృష్టించారని వైఎస్సార్‌సీపీ వర్గీయులు ఆరోపించారు. శభాష్‌పురం గ్రామంలో ఘర్షణకు సంబంధించి తిమ్మరాజు, అతని సోదరుడుపై, అలాగే రంగస్వామి, మరొకరిపై కేసు నమోదు చేసినట్లు తుగ్గలి ఎస్‌ఐ బాల నరసింహులు తెలిపారు.
మహిళలపై కట్టెలతో దాడి
ఇరువర్గాలపై పోలీసుల కేసు నమోదు