
కోర్టుకెక్కిన వీఏఏల బదిలీల వ్యవహారం
● బదిలీల్లో తీవ్ర అన్యాయం జరిగిందని హైకోర్టు కెక్కిన వీఏఏలు ● తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు స్టేటస్ కో ఆదేశాలు జారీ
కర్నూలు(అగ్రికల్చర్)/ఉయ్యాలవాడ: వ్యవసాయశాఖలో వీఏఏల బదిలీల వ్యవహారం కోర్టుకెక్కింది. ఇటీవల నిర్వహించిన వీఏఏల బదిలీల్లో అధికారులు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించలేదని, సీనియార్టీని పట్టించుకోలేదని, రాజకీయ సిఫారస్సులకు పెద్ద పీట వేశారని పేర్కొంటూ 20 మందికిపైగా వీఏఏలు హైకోర్టును ఆశ్రయించారు. వీఏఏల బదిలీలు ఉమ్మడి జిల్లా యూనిట్‌గా జరిగాయి. నంద్యాల జిల్లాలో పనిచేస్తున్న పలువురు వీఏఏలు ఎలాంటి ఆప్షన్ ఇవ్వకపోయినప్పటికీ కర్నూలు జిల్లాకు అలాట్ చేశారు. వారిని ఆదోని, కౌతాళం, పెద్దకడుబూరు తదితర మండలాలకు బదిలీ చేశారు.
● ఉయ్యాలవాడ మండలం మాయలూరు గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న గ్రామ వ్యవసాయ సహాయకురాలు సుమలత గర్భిణీ. దొర్నిపాడు, కోవెలకుంట్లలోని మూడు రైతు సేవా కేంద్రాలకు ఆప్షన్ ఇచ్చారు. అయితే ఆమెను ఆదోని వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలోని పెద్దకడుబూరు మండలంలోని మేకడోణకు బదిలీ చేశారు.
● తుడుమలదిన్నె గ్రామ వ్యవసాయ సహాయకురాలు రియాజున్ కొలిమిగుండ్ల మండలంలోని రెండు రైతు సేవా కేంద్రాలను ఆప్షన్‌గా ఎంచుకున్నారు. అయితే ఈమెను కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని కందుకూరు రైతు సేవా కేంద్రానికి బదిలీ చేశారు.
● హరివరం గ్రామ వ్యవసాయ సహాయకులు షేక్ సిద్ధిక్ బాషా ఉయ్యాలవాడ, కోవెలకుంట్ల మండలంలోని మూడు సేవా కేంద్రాలకు ఆప్షన్‌గా ఇవ్వగా మంత్రాలయం మండలంలోని సుంకేశ్వరి రైతు సేవా కేంద్రానికి బదిలీ చేశారు. ఇలా దాదాపు 200 కిలో మీటర్ల దూరంలో వున్న గ్రామాలకు వెళ్లేందుకు ఇష్టం లేని వీరితో పాటు జిల్లాలో మరో 20 మంది గ్రామ వ్యవసాయ సహాయకులు హైకోర్టును ఆశ్రయించారు. తమ వినతులను అధికారులు వినిపించుకోలేదని కోర్టుకు విన్నవించారు. వీఏఏల వాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు కోర్టును ఆశ్రయించిన వీఏఏలను తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కదిలించ వద్దని యథాస్థితి కొనసాగించాలని (స్టేటస్‌కో) ఆదేశాలు ఇచ్చింది.