
అర్జీలు రీఓపెన్ కానివ్వొద్దు
కర్నూలు(సెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇచ్చిన అర్జీలు రీఓపెన్ కాకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిష్కారమైన సమస్యల ఫీడ్ బ్యాక్‌పై ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని సరిదిద్దుకోవాలన్నారు. కర్నూలు డీఐ వద్ద 22, పత్తికొండ ఆర్‌డీఓ దగ్గర 19, కర్నూలు ఆర్‌డీఓ దగ్గర 15, ఆదోని సబ్‌కలెక్టర్ దగ్గర 15 కేసులు రీఓపెన్ అయినట్లు చెప్పారు. వీటిని త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. సీఎంఓ గ్రీవెన్స్‌లకు సంబంధించి ఆదోని సబ్ కలెక్టర్ దగ్గర 10, పత్తికొండ ఆర్‌డీఓ దగ్గర 3, కలెక్టరేట్ ఏఓ దగ్గర 3, ఉద్యాన శాఖ, సర్వే ఏడీ, జిల్లా రిజిస్ట్రార్, డీపీఓల దగ్గర ఒక్కో అర్జీ పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరగా పరిష్కరించాలని సూచించారు.
10 రోజుల్లో బీఎల్‌ఓలను నియమించండి
ప్రస్తుతం ఎన్నికల అంశాలకు సంబంధించి పనిచేసే బూత్ లెవల్ ఆఫీసర్(బీఎల్‌ఓలు) బదిలీ కావడంతో వారి స్థానాల్లో పది రోజుల్లో కొత్త వారిని నియమించాలని నియోజకవర్గాల ఈఆర్‌ఓలను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్ బి.నవ్య, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.