
15 నుంచి కేసీకి నీటి విడుదల
● హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కింద
33 చెరువులకు నీటి సరఫరా
● ఐఏబీ సమావేశంలో తీర్మాణించిన
ప్రజాప్రతినిధులు, అధికారులు
● ఐఏబీ సమావేశానికి
మంత్రి టీజీ డుమ్మా!
కర్నూలు(సెంట్రల్): ఈనెల 15 నుంచి కేసీ కెనాల్ కింద 3,763 ఎకరాకల ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్‌బాషా తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో నీటిపారుదల సలహా మండలి(ఐఏబీ) సమావేశం జరిగింది. సమావేశానికి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ డుమ్మా కొట్టగా కలెక్టర్ పి.రంజిత్‌బాషా, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, పాణ్యం, ఆదోని, కోడుమూరు ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, పార్థసారథి, బొగ్గుల దస్తగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్‌ఎల్‌సీ కింద ఆయకట్టుకు జూలై 18న సాగునీటిని విడుదల చేసేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. హంద్రీనీవా నుంచి కల్లూరు మండలం నాయకల్లు, కోడుమూరు మండలం లద్దగరి గ్రామాల వద్ద రెండు స్లూయిజ్‌లను ఏర్పాటు చేయాలని తీర్మానాలు ప్రభుత్వానికి పంపుతున్నామన్నారు. హంద్రీనీవా కాలువ సామర్థ్యం 3,850 క్యూసెక్కులకు పెంచుతూ చేపడుతున్న విస్తరణ పనులను పూర్తిచేసి జూలై 15 నుంచి నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అదే రోజే గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి కూడా నీటిని విడుదల చేయాలని నీటిపారుదల అధికారులను ఆదేశించారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కింద 33 చెరువులను పూర్తిగా నింపాలని నిర్ణయించామన్నారు. చెరువుల్లో పూడిక తీత కోసం ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద పనులు చేపట్టేలా చర్య లు తీసుకోవాలని మైనర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో యూరియా కృత్రిమ కొరతను సృష్టిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని వ్యవసాధికారులను ఆదేశించారు. సమావేశంలో జేసీ డాక్టర్ బి.నవ్య, ఆదోని సబ్‌కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఇరిగేష న్ ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి, హంద్రీనీవా ఎస్‌ఈ పాండురంగయ్య, కర్నూలు ఆర్‌డీఓ సందీప్‌కుమార్, పత్తికొండ ఆర్‌డీఓ భరత్‌నాయక్, కేసీ కెనాల్ ఈఈ ప్రతాప్, మైనర్ ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసులు పాల్గొన్నారు.
● హంద్రీనీవా నుంచి 77 చెరువులను ఎప్పటిలోగా నింపుతారని జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ప్రశ్నించగా.. విస్తరణ పనులు పూర్తయిన వెంటనే నింపడానికి చర్యలు తీసుకుంటామని హంద్రీనీవా అధికారులు వివరణ ఇచ్చారు.
● బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు మరమ్మతులను వెంటనే చేపట్టాలని, గాజులదిన్నె ప్రాజెక్టును ముందుగానే నింపాలని ఎమ్మెల్సీ బీటీ నాయుడు అధికారులను ఆదేశించారు.
● గుండ్రేవుల ప్రాజెక్టు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. హంద్రీనీవా నుంచి నీటిని విడుదల చేయగానే గాజులదిన్నె ప్రాజెక్టును నింపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నాయకల్లు, లద్దగిరి గ్రామాల వద్ద రెండు స్లూయిజ్‌లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
● ఆదోని సబ్ డివిజన్‌లో మైనర్ ఇరిగేషన్ శాఖకు సంబంధించి 4 ఏఈ, ఒక్క డీఈ పోస్టు ఖాళీగా ఉండడంతో ప్రతిపాదనలు పంపడానికి ఇబ్బందిగా ఉందని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ బి.పార్థసారథి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అందుకు కలెక్టర్ స్పందించి డీఈ, ఏఈలను నియమించాలని ఇరిగేషన్ ఎస్‌ఈ బాలచంద్రారెడ్డిని ఆదేశించారు. ఆదోనికి నీటిని సరఫరా చేసే బసాపురం చెరువు మరమ్మతుల కోసం రూ.33 కోట్లతో ప్రతిపానలు పంపినట్లు కలెక్టర్ చెప్పారు.
● కేసీ కెనాల్, గాజులదిన్నె ప్రాజెక్టులకు నీరు ఎప్పుడిస్తారని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ప్ర శ్నించారు. గుండ్రేవుల కోసం తీర్మానం చేయాలని సూచించారు. అన్యాకాంత్రమైన బి.తాండ్రపాడు గంగమ్మ చెరువును కాపాడాలని కలెక్టర్‌ను కోరారు.

15 నుంచి కేసీకి నీటి విడుదల