
సిఫార్స్ ఉన్న వారికేనా?
ఎమ్మిగనూరురూరల్: యూరియా పుష్కలంగా ఉందంటూ అఽధికారులు ఒక వైపు చెపుతున్నా రైతులు మాత్రం ఎరువుల బస్తాల కోసం నానా అవస్థలు పడాల్సి వస్తోంది. సోమవారం ఉదయం నుంచి డీసీఎంఎస్ వద్ద ఎరువుల కోసం క్యూలో నిల్చున్నా యూరియా అందకపోవటంతో సొసైటీ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. రైతులకు కాకుండా ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి పీఏ చెప్పిన వారికి, పోలీసులు, ఇతర నాయకులు చెప్పిన వారికే ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం వరకు వేచి ఉన్నా ఇవ్వకుండా రేపు రమ్మంటున్నారని, అలాంటప్పుడు పర్మిట్లు ఎందుకు ఇవ్వాలని సొసైటీ అఽధికారులను ప్రశ్నించారు. సాయంత్రం యూరియా లోడ్ రావటంతో వాగ్వాదానికి దిగిన రైతులకు పంపిణీ మాత్రమే పంపిణీ చేయడంతో రైతులు శాంతించారు.
ఎరువుల వివరాలు నమోదు చేయాలి
కర్నూలు(అగ్రికల్చర్): రసాయన ఎరువుల అమ్మకాల పూర్తి వివరాలను డీలర్లు ఎప్పటికప్పుడు ఈ–పాస్ మిషన్‌లతో నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో అవసరమైనన్ని ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అవసరం ఉన్నంతవరకు మాత్రమే యూరియా కొనుగోలు చేయాలన్నారు. డీఏపీ స్థానంలో మిశ్రమ ఎరువులు(ఎన్‌పీకే) 20–20–0–13, 16–20–0–13, 28–28–0, 14–35–14 ఎరువులను వినియోగించవచ్చన్నారు. జూలై నెలకు సంబంధించి 25,080 టన్నుల ఎరువులు రావాల్సి ఉందని, ఇప్పటి వరకు 2,801 టన్నులు వచ్చాయని తెలిపారు. రానున్న 3–4 రోజుల్లో యూరియా 1,896 టన్నులు రానుందని, కోరమాండల్ యూరియా 1,306, ఆర్పిఎఫ్ యూరియా 590 టన్నులు వస్తుందన్నారు.
విద్యార్థిని మృతదేహానికి పోస్టుమార్టం
ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని బనవాసి ఏపీ గురుకుల జూనియర్ కాలేజీలో ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని రిషిత(16) మృతదేహానికి సోమవారం స్థానిక ప్రభుత్వాసుప్రతిలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించటంతో వారు తమ స్వగ్రామానికి అంత్యక్రియల నిమిత్తం తీసుకుకెళ్లారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
వీబీఆర్‌లోకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
వెలుగోడు: వెలుగోడు తెలుగుగంగ జలాశయంలోకి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. బానకచెర్ల క్రాస్ హెడ్ రెగ్యులేటర్ నుంచి 5,500 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రస్తుత జలశాయంలో 251.94 మీటర్ల వద్ద 826.573 2.260 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలుగుగంగ ఏఈఈ శివనాయక్ తెలిపారు.