
బదిలీల్లో సిఫార్స్‌లకే పెద్దపీట
కర్నూలు(అగ్రికల్చర్): గ్రామ వ్యవసాయ సహాయకుల బదిలీలు అడ్డుగోలుగా జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకపక్షంగా జరుగుతున్న బదిలీలను నిరసిస్తూ వీఏఏలు జిల్లా వ్యవసాయ అధికారి చాంబరు ఎదుట బైఠాయించారు. సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ఉద్దేశించిన జీఓను వ్యవసాయ అధికారులు పరిగణలోకి తీసుకున్న దాఖలాలే లేకపోవడం పట్ల సర్వత్రా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల వెలువడిన ఉత్తర్వుల్లో గత ఏడాది నవంబరు మాసంలో మరణించిన వీఏఏను దేవనకొండ మండలం తెర్నెకల్‌కు పోస్టింగ్ ఇవ్వడం గమనార్హం. కొన్ని నెలల క్రితం మరణించిన వీఏఏ ఎపుడు ఆప్షన్ ఇచ్చారో.. ఎలా బదిలీ చేశారో వ్యవసాయ యంత్రాంగానికే తెలియాలి. సిపారస్సు లేఖలు లేకపోతే ఆదోని, హాళహర్వి, కౌతాళం, పెద్దకడబూరు, హొళగుంద, ఆలూరు, కోసిగి మండలాలకు పంపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్టీకి చెందిన శివనాయక్ ఇంతవరకు నంద్యాల జిల్లాలో పనిచేశారు. సీనియార్టీ జాబితాలో ఈయన పేరు 136, ర్యాంకు 4. ఈయనకు కౌన్సెలింగ్ ప్రకారం కర్నూలు పరిసర మండలాలు దక్కాలి. కానీ ఆలూరు మండలానికి పంపారు. సీనియారిటీ జాబితాలో 150పైన ఉన్న వారికి దగ్గరి మండలాలు దక్కాయి. కారణం సిపారస్సు లేఖలు తెచ్చుకోవడమేనని తెలుస్తోంది. నంద్యాల జిల్లాలో పనిచేసిన నాగహర్షిత గర్భిణి. ఈమెను ఆదోని మండలం మంత్రికి గ్రామానికి బదిలీ చేశారు. ఇలా వందల మంది వీఏఏలతో వ్యవసాయ యంత్రాంగం చెలగాటమడుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీఏఏలు జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో బైఠాయించినప్పటికీ పట్టించుకునే వారు లేకపోవడం గమనార్హం.
జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం ఎదుట వీఏఏల బైఠాయింపు