
కుంటుపడిన గిరిజన విద్య!
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జూన్ 12న ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభమైనా, నేటికీ ఆయా ఆశ్రమ పాఠశాలలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయని పరిస్థితి. జిల్లాలోని కర్నూలు (బాలురు), తుగ్గలి (బాలికలు), ఆలూరు (బాలురు) ప్రాంతాల్లో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలల్లో దాదాపు 600 మంది విద్యార్థులు విద్యతో పాటు వసతిని పొందుతున్నారు. అయితే ఈ పాఠశాలల్లో పలు ముఖ్యమైన సబ్జెక్టులను బోధించేందుకు కూడా ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థుల చదువులు కుంటుపడుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధానంగా వివిధ సబ్జెక్టులకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్, సెకండరీ స్కూల్ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఫిజకల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, తెలుగు, ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లో ఆయా పాఠశాలల్లో పనిచేసే పలువురు ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాలకు వెళ్లడం వల్ల జిల్లాలోని మూడు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలు ఏర్పడినట్లు తెలుస్తోంది.
ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు
● కర్నూలులో స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) టీచర్ మూడు నెలల వరకు మెడికల్ లీవ్‌లో వెళ్లినట్లు తెలిసింది. ఇదే స్కూల్‌లో ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.
● తుగ్గలి (రాతన)లో గ్రేడ్–2 హెడ్‌మాస్టర్ పోస్టుతో పాటు తెలుగు, మ్యాథ్స్ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదే స్కూల్‌లో నాలుగు ఎస్‌జీటీ శాంక్షన్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం ఒకరు మాత్రమే విధులు నిర్వహిస్తుండగా, మిగిలిన మూడు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.
● ఆలూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఒక ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆశ్రమ పాఠశాలల్లో
10 మంది టీచర్ల కొరత