
వీడిన శేషన్న హత్య కేసు మిస్టరీ
కర్నూలు: కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన కురువ శేషన్న (62) హత్య కేసు మిస్టరీ వీడింది. కురువ శేషన్న తన కూతురు శకుంతల ఇంట్లో పడుకుని ఉండగా ఈనెల 1న రాత్రి అదే గ్రామానికి చెందిన కురువ ఎల్లయ్య అలియాస్ తెల్లన్న కుమారులు కురువ పరశురాముడు, కురువ విజయ్ కుమార్, కురువ గోవిందు, కురువ బీసన్నలు కలిసి ఇంట్లోకి చొరబడి కొడవళ్లు, కర్రలతో దాడి చేసి హత్య చేశారు. శేషన్న కుడి కాలిని నరికి బైకులో తీసుకుని ఊరంతా తిరుగుతూ భయోత్పాతం సృష్టించారని హతుని కూతురు శకుంతల ఫిర్యాదు మేరకు కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా కర్నూలు శివారులోని వెంగన్న బావి వద్ద శివాలయం వెనుక నిందితులు ఉన్నట్లు పక్కా సమాచారంతో ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. నేరానికి ఉపయోగించిన కత్తులు, బైకులను వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకుని కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ ఎదుట హాజరుపరిచారు. తాలూకా సీఐ శ్రీధర్, ఎస్‌ఐ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి సోమవారం డీఎస్పీ తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. నిందితుల్లో ఒకరైన పరశురాముడి భార్యతో శేషన్నకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని డీఎస్పీ వివరించారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలు తలెత్తితే పోలీసులకు ఫిర్యాదు చేసి పరిష్కరించుకోవాలి తప్ప శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు.
వివాహేతర సంబంధం
అనుమానంతో...
హత్య చేసినట్లు దర్యాప్తులో
తేల్చిన పోలీసులు