
టీడీపీ కార్యాలయానికి తాళం
● టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ తేలేవరకు ఇంతే!
ఆలూరు: అధికార పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆలూరులోని టీడీపీ కార్యాలయానికి తాళం వేసే వరకు వచ్చాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తేలేవరకు ఇంతే సంగతులు అంటూ ఆ పార్టీ నాయకులే నిట్టూర్చుతున్నారు. టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్న బి. వీరభద్రగౌడుపై ఆపార్టీ నాయకుల్లో వ్యతిరేకత ఉంది. ఆస్పరి మండలం కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో శనివారం ఉదయం నిర్వహించిన తొలి అడుగు కార్యక్రమానికి కర్నూలు ఎంపీ బస్తిపాడు నాగరాజు, ఆలూరు టీడీపీ పరిశీలకులు పూల నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ అనుచరులు సమావేశాన్ని అడ్డుకున్నారు. ‘నియోజకవర్గ ఇన్‌చార్జ్ లేకుండా ఇక్కడ మీ పెత్తనం ఏంటని’ అంటూ నిలదీశారు. అనంతరం ఆలూరులో తొలి అడు గు కార్యక్రమానికి హాజరైన తిక్కారెడ్డిని గౌడ్ అనుచరుల అడ్డుకున్నారు. ఇన్‌చార్జి లేకుండా సమావేశం నిర్వహిస్తే ఒప్పుకునేది లేదని వేదిక ముందు బైఠాయించారు. తిక్కారెడ్డి డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే అప్పటికప్పుడు అధిష్టానంతో మాట్లాడి ఆలూరు సమావేశంలోనే ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా వీరభద్రగౌడ్‌ను తొలగిస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో ఆదివారం ఆలూరు టీడీపీ ఆఫీసుకు తాళం వేసి నిరసన తెలిపారు.