
బాబూ.. హామీని మరిచారు!
కర్నూలు(అర్బన్): తాము అధికారంలోకి వస్తే ఏకలవ్యుని జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరిచారని ఎరుకలి హక్కుల పోరాట సమితి నేతలు విమర్శించారు. విలువిద్యలో ఏకలవ్యుని జీవితం నేటి యువతరానికి ఆదర్శమని, ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఆదివారం ఏకలవ్యుని జయంతి సందర్భంగా స్థానిక వైహెచ్‌పీఎస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరుకల రాజు, గౌరవాధ్యక్షులు ఎరుకలి కుమార్, మాజీ కార్పొరేటర్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి రోజున ఎరుకల ఆరాధ్య దైవమైన ఏకలవ్యుని జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా అధ్యక్షులు ఎరుకలి హరి, ఏకలవ్య యూత్ జిల్లా అధ్యక్షులు ఎరుకల గోపి, ఎస్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షులు కుశలన్న, హరి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఏకలవ్యుని జయంతిని అధికారికంగా నిర్వహించాలి