
పీర్లను దర్శించుకునేందుకు వెళ్తూ..
డోన్ టౌన్: సొంతూరులో నెలకొల్పిన పీర్లను దర్శించుకునేందుకు వెళ్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. డోన్ పట్టణం ఇందిరానగర్‌లో నివాసముంటున్న ఇమామ్‌బాషా(34) సొంతూరు కొత్తబురుజు గ్రామం. డోన్ కంభాలపాడు సర్కిల్ వద్ద ఉన్న ఈద్గా మజీద్ ప్రాంతంలో బండిపై తినుబండారులు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. సొంతూరులో మొహర్రం సందర్భంగా నెలకొల్పిన పీర్లకు మొక్కులు చెల్లించేందుకు ఆదివారం బైక్‌పై బయలుదేరాడు. మార్గమధ్యలో యు.కొత్తపల్లె వద్ద ఉన్న భారత్‌దాబా ఎదురుగా జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి బెంగుళూరు వైపు వెళుతున్న లారీ బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇమామ్‌బాషా తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య షమీనా, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంఘటనా స్థలానికి టౌన్ ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేశారు.