
దివిటీల వెలుగులో పీర్ల ఊరేగింపు
కోవెలకుంట్ల: పట్టణంలోని బసిరెడ్డిబావి వీధిలో కొలువుదీరిన హజరత్ అబ్బాస్ పీరును శుక్రవారం అర్ధరాత్రి దివిటీల వెలుగులో ఘనంగా ఊరేగించారు. ఖర్భలా మైదానంలో యజీర్‌రాజుతో జరిగిన యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనువడు ఇమాం ఉశేన్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యుడు హజరత్ అబ్బాస్ మృతిచెందగా ఆయనను స్మరించుకుంటూ ఏటా మొహర్రం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మధ్య సరిగెత్తును పురస్కరించుకుని అర్ధరాత్రి వెయ్యి దివిటీల వెలుగులో హజరత్ అబ్బాస్ పీరును పురవీధుల గుండా ఊరేగించారు. కోవెలకుంట్ల, బనగానపల్లె, ఆళ్లగడ్డ తదితర ప్రాంతాల షియా మతస్తులు మాతం నిర్వహిస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. హాజరత్ అబ్బాస్ పీరుకు భక్తులు ప్రత్యేక ఫతేహాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
ఘనంగా పెద్ద సరిగెత్తు
బనగానపల్లె నియోజకవర్గంలో శనివారం పెద్దసరిగెత్తును ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని చిన్నబార్ ఇమాం, పెద్దబార్ ఇమాం, రంగరాజుపేట, బాబానగర్, జెండామాను వీధి, గుద్దేటి వీధి తదితర ప్రాంతాల్లోని చావిళ్లలో కొలువుదీరిన ఇమాంకాశీం, బీబీఫాతిమా, అజరత్ అలీ అక్బర్, దస్తగిరిస్వామి, మస్తాన్‌వలి, ఉద్దండ ఇమాంకాశీం పీర్లకు భక్తులు పూలదట్టీలు సమర్పించి మొక్కులు తీర్చున్నారు. ఆయా చావిళ్ల ఎదుట అగ్ని గుండాల చుట్టూ ప్రదక్షిణలు చేసి ఫతేహాలు నిర్వహించారు. ఆదివారం పీర్ల నిమజ్జనంతో మొహ్రరం ముగియనుంది.
మాతం నిర్వహించిన షియా మతస్తులు
ఘనంగా పెద్ద సరిగెత్తు