
డాక్టర్ల వద్దకే మెడికల్ రిజిస్ట్రేషన్
కర్నూలు(హాస్పిటల్): రాష్ట్రంలో ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలులో భాగంగా కర్నూలు మెడికల్ కాలేజీలో డాక్టర్ల వద్దకే మెడికల్ రిజిస్ట్రేషన్లు తీసుకొచ్చినట్లు రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కళాశాలలోని మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్‌లో రెండు రోజుల పాటు నిర్వహించే వైద్యుల సర్టిఫికెట్ల రెన్యువల్స్‌ను మంత్రి టీజీ భరత్ శనివారం ప్రారంభించారు. అనంతరం వైరాలజీ ల్యాబోరేటరీ(వీఆర్‌డీఎల్)కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్‌లో ఉన్న ఇబ్బందులను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలో వైద్యులు రెండు, మూడు రోజులు సమయం కేటాయించి మెడికల్ సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్ చేసుకునే వారని, ఇప్పుడు వారి చెంతకే రిజిస్ట్రేషన్ ప్రక్రియ రావడం వల్ల గంటల్లో పని పూర్తవుతుందన్నారు. వీఆర్‌డీఎల్ భవనాన్ని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరిరావు, ఆదోని ఎమ్మెల్యే పార్థసారఽథి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.