
ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం
కల్లూరు: ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తోందని ఆ పార్టీ నంద్యాల, కర్నూలు జిల్లాల అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. కర్నూలు నగరంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శనివారం సాయంత్రం పాణ్యం నియోజకవర్గ స్థాయి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘బూబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ’ పోస్టర్లను ఆవిష్కరించారు. చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ ‘క్యూఆర్ ’ కోడ్‌ను స్కాన్ చేస్తే ప్రతి కుటుంబం ఏడాది కాలంలో ఎంత నష్టపోయిందో తెలుస్తుందన్నారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ (పార్టీ నంద్యాల పార్లమెంటరీ పరిశీలకులు ) కల్పలత రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, నగర మేయర్ బీవై రామయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
‘సూపర్’ మోసం
కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ హామీల పేరుతో ప్రజలను టీడీపీ అధినేత చంద్రబాబు మోసం చేశారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది తర్వాత తల్లికి వందం పథకం ఇచ్చారని, అది కూడా అందరికీ అందలేదన్నారు. ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ పథకాలు మరచిపోయారన్నారు. ‘రెడ్‌బుక్’ పేరుతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. గ్రీన్‌కో ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, తనకు దుక్కుతుందన్నారు. గ్రీన్‌కో ప్రాజెక్టు భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు.
‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చూపిద్దాం
రాబోయే కాలంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు రానున్నాయని, అన్ని స్థానాల్లో విజయం సాధించి వైఎస్సార్‌సీపీ సత్తా చూపిద్దామని ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకతను తెచ్చుకుందన్నారు. ‘కూటమి’ నేతల తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని, రాబోయే కాలంలో జగనన్న రాజ్యం వస్తుందని, ప్రజా సంక్షేమంతో పాటు నాయకులకు, కార్యకర్తలందరకీ న్యాయం జరుగుతుందన్నారు.
మేనిఫెస్టోను మరచిపోయారు
ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోను టీడీపీ అధినేత చంద్రబాబు మరచిపోయారని ఎమ్మెల్సీ (నంద్యాల పార్లమెంటరీ పరిశీలకులు) కల్పలతరెడ్డి విమర్శించారు. 2014–2019 కాలంలో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను వెబ్‌సైట్‌ను తీసివేసిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినా సుగాలిప్రీతి తల్లిదండ్రులకు న్యాయం జరగలేదన్నారు. జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్టు నిండా నీళ్లు ఉన్నా హంద్రీనీవా కాలువకు, గోరుకల్లు రిజర్వాయర్‌కు నీళ్లు రాక రైతులు నష్టపోతున్నారన్నారు. మేయర్ బీవై రామయ్య మాట్లాడుతూ.. హామీలు అమలు చేయకుండా ఏడాది కాలంలో రాష్ట్ర ప్రజలకు రూ. 85 వేల కోట్లు మోసం చేశారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అంటే వెన్నపోటు, మోసం, అబద్ధాలు గుర్తుకు వస్తాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, ఎంపీపీలు, కల్లూరు అర్బన్ కార్పొరేటర్లు, వైఎస్సార్‌సీపీ వివిధ విభాగాల్లో పదవులు పొందిన వారు పాల్గొన్నారు.
మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట
తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు
వైఎస్సార్‌సీపీ నంద్యాల, కర్నూలు
జిల్లాల అధ్యక్షులు కాటసాని
రాంభూపాల్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి