
వైభవంగా సుదర్శనమూర్తి జయంత్యుత్సవం
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రం దిగువ అహోబిలంలో సుదర్శనమూర్తి జయంత్యుత్సవాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ముందుగా కొలువైన మూలమూర్తులు శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్లను సుప్రభాత సేవతో మేలుకొలిపి దివ్యదర్శనం అనంతరం నిత్యపూజలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వామి, సుదర్శన మూర్తులను కొలు వుంచి నవకళశస్థాపన అనంతరం, పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహించి ఉత్సవమూర్తలను నూతన పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలకంరించి కొలువుంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం ఉభయ దేవురులతో కొలువైన శ్రీ నృసింహస్వామి ఎదురుగా శ్రీ సుదర్శన మూర్తిని కొలువుంచి ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాలు, వేద పండితుల వేదమంత్రోచ్చారణలు నడుమ సదర్శన హోమం శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించారు.
సుదర్శన హోమం ప్రత్యేకత
సాధారణంగా నారసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున ఏడాది పొడవునా సుదర్శన హోమం నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఆషాఢ మాసంలో వచ్చే స్వాతి నక్షత్రానికి ముందు రోజు సుదర్శన మూర్తి జయంతి కావడంతో ఏడాదిలో ఈ ఒక్క రోజు సుదర్శన హోమం స్వాతి రోజు కంటే ముందు రోజు నిర్వహించడం జరుగుతుంది. సుదర్శన మూర్తి ఆరు చేతులతో ఆరు ఆయుధాలు కల్గి ఉండి వైష్ణవ దేవుళ్లను రక్షిస్తుంటారని విశ్వాసం. సుదర్శన మూర్తికి ఆదిదేవుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కావడంతో ప్రతి స్వాతి వేడుకల్లో సుదర్శన హోమం నిర్వహించడం ఆనవాయితీ. స్వాతి నక్షత్రం సందర్భంగా శనివారం దిగువ అహోబిలంలో ఉత్సవ మూర్తులకు తెల్లవారుజామున జేష్టాభి షేక వేడుకలు నిర్వహించనున్నారు.

వైభవంగా సుదర్శనమూర్తి జయంత్యుత్సవం