
టీడీపీ నాయకుడి దౌర్జన్యం
అప్పు తిరిగివ్వమనడంతో రౌడీ మూకలతో దాడి
● గుండుపాపల గ్రామంలో ఉద్రిక్తత
ఆళ్లగడ్డ: తీసుకున్న అప్పులు తిరిగివ్వమని అడగటంతో టీడీపీ నాయకుడు రౌడీమూకలతో కలిసి దాడిచేసిన ఘటన దొర్నిపాడు మండలం గుండుపాపల గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలివీ.. గుండుపాపల గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కాశీవిశ్వనాథర్‌రెడ్డి ఆళ్లగడ్డ పట్టణ పరిధిలోని రాజారెడ్డి దగ్గర అప్పుగా కొంత నగదు తీసుకున్నాడు. ఎన్నిరోజులైనా తిరిగి చెల్లించకపోవడంతో రాజారెడ్డి కుటుంబం అప్పు వసూలు చేసుకునేందుకు కొన్ని రోజులుగా గుండుపాపల గ్రామంలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాజారెడ్డి భార్యతో కలిసి కాశీవిశ్వనాథర్‌రెడ్డి ఇంటి దగ్గరకు వెళ్లి అప్పు విషయమై గట్టిగా నిలదీశారు. దీంతో ఆగ్రహించిన కాశీవిశ్వనాథర్‌రెడ్డి రాత్రి సుమారు 10 మంది రౌడీలతో కలిసి ఫూటుగా మద్యం సేవించి రాజారెడ్డి ఉన్న ఇంటిమీదకు వెళ్లి రాళ్లతో దాడిచేస్తుండగా బయటకు వచ్చిన రాజారెడ్డిపై దాడిచేసి కొట్టారు. ఇది గమనించిన రాజారెడ్డికి ఆశ్రయం ఇచ్చిన శేఖర్‌రెడ్డి బయటకు వచ్చి సర్ది చెప్పేందుకు యత్నిస్తుండగా దీనికంతటికీ కారణం నువ్వే, నువ్వు ఆశ్రయం ఇవ్వడంతోనే వారు ఇక్కడ ఉండి నన్ను రోజూ అప్పు అడుగుతున్నారని శేఖర్‌రెడ్డి కుటుంబంపైనా దాడి చేశారు. ఈ విషయంపై దొర్నిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు గాయపడ్డ శేఖర్‌రెడ్డి, రాజారెడ్డిలు తెలిపారు.