
పెయ్య దూడల అభివృద్ధికి చర్యలు
● జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యనిర్వహణ అధికారి రాజశేఖర్
కర్నూలు(అగ్రికల్చర్): పెయ్య దూడల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఉమ్మడి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యనిర్వహణ అధికారి డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో 23,200, నంద్యాల జిల్లాలో 30 వేల పశువులకు పెయ్య దూడలు పుట్టడం లక్ష్యంగా కృత్రిమ గర్భధారణ సూదులు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి ప్రారంభించామన్నారు. ఒక డోసు వీర్య నాళికల పూర్తి ధరను రూ.300 ఉండగా 50 శాతం సబ్సిడీ ఇచ్చే విధంగా పశుసంవర్ధక శాఖ చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ఆవులు, గేదెలు ఎదకు వచ్చినపుడు రూ.150 చెల్లించి లింగనిర్ధారిత వీర్య నాళికలతో కృత్రిమ గర్భాధారణ చేయించవచ్చని తెలిపారు.
రైతుల అభివృద్ధికి ‘సహకార’ం
గడివేముల: రైతుల అభివృద్ధికి సహకార సంఘాలు ఎంతో ఉపయోగపడతాయని జిల్లా సహకార అధికారి ఎన్ రామాంజనేయులు తెలిపారు. అంతర్జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా శుక్ర వారం గడివేముల జెడ్పీ పాఠశాలలో కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సహకార అధికారి మాట్లాడుతూ.. సహకార సంఘాలతో అనేక మంది రైతులకు రుణాలతో పాటు వివిధ పథకాలు అందిస్తున్నామన్నారు. ఎస్‌డీఎల్ తిరుపాలయ్య, సూపరింటెండెంట్‌లు రాముడు, రషీద్ ఫకృద్దీన్, సంధాని, ఏజీఎం భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.