
అక్రమంగా డీఏపీ నిల్వ
● సీజ్ చేసిన వ్యవసాయాధికారులు
ఆదోని రూరల్: పెద్దతుంబళం గ్రామంలోని నబీ ట్రేడర్స్‌లో అక్రమంగా నిల్వ ఉన్న డీఏపీ ఎరువును సీజ్ చేసినట్లు ఆదోని మండల వ్యవసాయ అధికారులు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గురువారం సాయంత్రం ఆకస్మికంగా దుకాణాన్ని తనిఖీ చేశామన్నారు. అనుమతులు లేకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా తీసుకొచ్చిన డీఏపీ ఎరువు 76 బస్తాలు దుకాణంలో ఉన్నట్లు గుర్తించామన్నారు. దీని విలువ రూ.1,02,600 ఉంటుందన్నారు. నిల్వ ఉంచిన డీఏపీ ఎరువు అమ్మకాలు చేయకుండా నిలిపివేసినట్లు చెప్పారు. నాణ్యత పరీక్ష నిమిత్తం నమూనాలను సేకరించి, వాటిని ప్రయోగశాలకు పంపిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష ఫలితాల అనంతరం దుకాణ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.