
యూఎల్‌బీల ఎంపికలో ప్రభుత్వం వివక్ష
కర్నూలు(టౌన్): యూఎల్‌బీలను(అర్బన్ లోకల్ బాడీ) బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 25 మున్సిపాల్టీలను ఎంపిక చేసింది. ఎంపిక చేసిన కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధులైన మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, చైర్ పర్సన్లకు ఈ నెల 3, 4 తేదీల్లో హర్యానా రాష్ట్రంలోని గుర్‌గ్రామ్‌లో రెండు రోజులపాటు జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల బలోపేతం దిశగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రభుత్వం ఇప్పటికే జీవో 643 జారీ చేసింది. అయితే అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించిన ప్రభుత్వం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక్క మున్సిపాల్టీని కూడా ఎంపిక చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎంపిక చేసిన వాటిల్లో ఇటీవల వైఎస్సార్‌సీపీ నుంచి తెలుగుదేశం కండువా కప్పుకున్న మున్సిపల్ చైర్మన్లు, చైరపర్సన్లకు పెద్దపీట వేసింది. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ చైర్మన్, డోన్ వైస్ చైర్మన్‌లు వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ రెండు మున్సిపాల్టీలను సైతం విస్మరించారు. ప్రభుత్వ ‘పచ్చ’పాత ధోరణిపై స్థానిక మంత్రులు కూడా నోరు మెదపకపోవడం గమనార్హం. ఇదిలాఉంటే ఉమ్మడి జిల్లాలను పూర్తిగా విస్మరించడంపై డోన్ మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై రాష్ట్ర మున్సిపల్ మంత్రి నారాయణకు లేఖ రాశారు. ఇది మంచి సంప్రదాయం కాదని, స్థానిక సంస్థల అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ ఎంతో కృషి చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కేవలం రాజకీయం కోణంలో ఈ ప్రభుత్వం యుఎల్‌బీలను ఎంపిక చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.