
పోలీసుల అదుపులో హత్యకేసు నిందితులు
కర్నూలు: కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన కురువ శేషన్న (62)ను హత్య చేసిన దుండగులను కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శేషన్న లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయన ఇంటి వెనుక ఉన్న అదే సామాజిక వర్గానికి చెందిన తెల్లన్న కుమారులు గోవిందప్ప అలియాస్ చౌదరి, బీసన్న, కుమార్, పరుశురాముడు కలిసి మంగళవారం రాత్రి శేషన్న ఇంట్లోకి దూరి కత్తులతో దాడి చేసి హత్య చేశారు. విషయం తెలిసిన వెంటనే కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులు గ్రామానికి చేరుకుని ఉద్రిక్త పరిస్థితిని అదుపు చేశారు. నిందితుల్లో ఒకరు శేషన్న కాలును నరికి తీసుకెళ్లి పోలీసులకు లొంగిపోగా మిగతా ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరశురాముడు భార్యను కొంతకాలంగా శేషన్న వేధిస్తుండటం వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు విచారణలో నిందితులు అంగీకరించినట్లు సమాచారం. శేషన్న కూతురు శకుంతల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అనాథ పిల్లలకు వైద్యపరీక్షలు
కర్నూలు(హాస్పిటల్): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ వాత్సల్య ప్రోగ్రాంలో భాగంగా జిల్లాలోని అనాథ పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్రీయ బాలస్వాస్త్య కార్యక్రమ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ మహేశ్వర ప్రసాద్ చెప్పారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. జిల్లాలోని పెద్దపాడులో 49 మంది, పత్తికొండలో 33 మంది, కర్నూలులోని స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీలో ముగ్గురు, చైల్డ్ హోమ్స్, చైల్డ్ ఇన్‌స్టిట్యూట్‌లలో 131 మంది అనాథ పిల్లలు ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరికి డిస్ట్రిక్ట్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (డైస్) వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందిస్తారన్నారు. అలాగే ఈ నెల 10న ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 1,459 ప్రభుత్వ పాఠశాలలో 3,14,892 మంది విద్యార్థులు ఉన్నారని, వారికి ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీలు వైద్య పరీక్షలు చేస్తారన్నారు. ముందుగా హాస్టళ్లలో ఈ కార్యక్రమం నిర్వహించి, అనంతరం ఈ ఏడాది చివరిలోపు తొలి విడత స్క్రీనింగ్ పూర్తి చేస్తామని చెప్పారు.
ఉద్యోగం పేరిట సైబర్ మోసం
గోనెగండ్ల: సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడి హెచ్.కై రవాడి గ్రామానికి చెందిన కురువ వీరేష్ రూ.45 వేలు మోసపోయాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. హెచ్.కై రవాడికి చెందిన కురువ వీరేష్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో జూన్ 26న ఓ మొబైల్ యాప్‌లో ఉద్యోగ నోటిఫికేషన్ లింక్‌ను క్లిక్ చేశాడు. హీరో హోండా షోరూంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు అప్లికేషన్ కోసం రూ.3 వేలు పంపాలని చూపడంతో అక్కడ సూచించిన ఖాతాకు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేశాడు. మరుసటి రోజు ఉద్యోగం కావాలంటే కంపెనీ బాండ్ కోసం మరో రూ.3 వేలు చెల్లించాలని చూపడంతో నగదు పంపాడు. తర్వాత 28న బ్యాంకు ఖాతా ఓపెన్ చేసేందుకు రూ.5 వేలు పంపాలని, బ్యాంకు అకౌంట్‌కు ఆధార్ లింక్ చేసేందుకు మరో రూ.5 వేలు పంపాలని సూచించడంతో అలాగే చెల్లించాడు. తర్వాత మీరు ఇప్పటివరకు కట్టిన డబ్బు తిరిగి మీ అకౌంట్లో జమ కావాలంటే రూ.10 వేలు చెల్లించాలని సూచించడంతో నగదు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఇలా 5 రోజుల్లో రూ.45 వేలు జమ చేశాడు. మళ్లీ సోమవారం అలాగే ఫోన్ రావడంతో తండ్రికి విషయం చెప్పాడు. దీంతో మోసపోయినట్లు గ్రహించి గోనెగండ్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా వారి సూచన మేరకు కర్నూలులోని సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు.