
భర్త చేష్టలు భరించలేక గడప దాటిన ఇల్లాలు
మంత్రాలయం: భర్త చేష్టలను భరించలేక ఓ ఇల్లాలు తన పిల్లలతోపాటు ఇంటినుంచి వెళ్లిపోయింది. నాలుగు రోజులపాటు శ్రీమఠం ముంగిట పిల్లలతో గడిపింది. బాధను ఎవరికీ చెప్పుకోలేక కన్నీళ్లు దిగమింగుతూ వెల్లదీసింది. భక్తులను యాచిస్తూ పిల్లలకు ఆకలి దప్పులు తీర్చింది. వివరాలివి.. కర్ణాటకలోని రాయచూరు జిల్లా, కలమల గ్రామం, మారుతి నగర్‌కు చెందిన శివమ్మకు భర్తతో సరిపోక కూతురు వర్షిణి, కుమారుడు నాగరాజతో కలిసి నాలుగు రోజుల క్రితం మంత్రాలయం వచ్చింది. అక్కడ భక్తులను అడుక్కుంటూ పిల్లలను పోషించింది. భార్యాపిల్లలు కనబడకపోవడంతో భర్త బసవరాజు రాయచూరులోని నేతాజీనగర్ పోలీస్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా బుధవారం స్థానిక ఎస్‌ఐ శివాంజల్‌కు సమాచారం రావడంతో ఫొటోలు తెప్పించుకుని ఊరంతా వెతికారు. కానిస్టేబుల్ రంగస్వామి శ్రీమఠం ప్రాంగణంలో ఆ తల్లీబిడ్డలను గుర్తించి స్థానిక పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. విచారణ సమయంలో ఆమె తన భర్త బసవరాజుతో వెళ్లేందుకు విముఖత వ్యక్తం చేసింది. ఎస్‌ఐ శివాంజల్ వారిని రాయచూరు పోలీసులకు అప్పగించారు. ఏదేమైనా తల్లీబిడ్డలు సురక్షితంగా దొరకడంతో అటు రాయచూరు పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇద్దరు పిల్లలతో
మంత్రాలయం చేరుకున్న తల్లి
నాలుగు రోజులుగా శ్రీమఠం ముంగిట
యాచిస్తూ పొట్టనింపుకున్న వైనం