
‘పోతిరెడ్డిపాడు గేట్లు మేమే ఎత్తేస్తాం’
పాములపాడు: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయకపోతే తామే గేట్లను ఎత్తుతామని ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. బుధవారం స్థానిక నెమలి వెంకటరెడ్డి సీపీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం 875 అడుగుల నీటి మట్టం ఉందన్నారు. నీటి మట్టం 851 అడుగులు దాటితే పోతిరెడ్డిపాటు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని విడుదల చేసి జిల్లాలోని వెలుగోడు, గోరుకల్లు రిజర్వాయర్లు నింపవచ్చన్నారు. అలాగే తెలుగుగంగ, జీఎన్‌ఎస్‌ఎస్ కాలువల ద్వారా జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు, చెరువులకు నీటిని సరఫరా చేయవచ్చన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 875 అడుగులకు చేరినా అధికారులు ఎందుకు అలసత్వం వహిస్తున్నారని ప్రశ్నించారు. మే నెలలో కురిసిన వర్షాలకు రైతులు విత్తనాలు వేశారని, జూన్‌లో వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నీటి విడుదలకు చర్యలు తీసుకోకపోతే ఈ నెల 4న తామే పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తామని స్పష్టం చేశారు. కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు స్వామన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బాలయ్య, సీఐటీయూ నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు.
స్పష్టం చేసిన ఏపీ రైతు సంఘం
నాయకులు
అధికారులు, ప్రజాప్రతినిధుల
నిర్లక్ష్యంపై ఆగ్రహం