వైద్యసేవలకు ఆన్‌లైన్‌ శోధన | - | Sakshi
Sakshi News home page

వైద్యసేవలకు ఆన్‌లైన్‌ శోధన

May 25 2025 8:10 AM | Updated on May 25 2025 8:10 AM

వైద్యసేవలకు ఆన్‌లైన్‌ శోధన

వైద్యసేవలకు ఆన్‌లైన్‌ శోధన

● మందులు తెలుసుకొని సొంత వైద్యం ● వైద్యుల వద్దకు వెళ్లినా రాసిచ్చిన మందులపై అనుమానం ● మంచివో.. కాదోనని ఇంటర్‌నెట్‌లో తెలుసుకునే ప్రయత్నం ● సోషల్‌ మీడియా కథనాలను అనుసరిస్తున్న వైనం ● తెలిసీ తెలియని వైద్యంతో అవస్థలు

కర్నూలు(హాస్పిటల్‌): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3వేల దాకా రిటైల్‌ మెడికల్‌ షాపులు, ఏజెన్సీలు ఉన్నాయి. దీంతో పాటు 12వేల దాకా ఎంబీబీఎస్‌, స్పెషాలిటీ, సూపర్‌స్పెషాలిటీ కోర్సులు అభ్యసించిన వైద్యులూ ఉన్నారు. వీరితో పాటు వైద్యవిద్యను అభ్యసిస్తున్న వారు మరో 3వేల మంది దాకా ఉంటారు. ఇక ఫార్మాసిస్టులు, నర్సులు, ఏఎన్‌ఎంలు, ఆర్‌ఎంపీలు మరో 15వేల దాకా ఉంటారు. వీరందరూ అల్లోపతి వైద్యంపై ఆధారపడి రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు వచ్చిన ప్రజలు వీరిలో ఎవరో ఒకరిని సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల ఇంటర్‌నెట్‌ సదుపాయం అందరికీ అందుబాటులోకి రావడం, విద్యావంతులు పెరగడం, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌, ఇంటర్‌నెట్‌పై యువతకు పట్టురావడం వంటి విషయాల కారణంగా ఆన్‌లైన్‌లో తమకు వచ్చిన ఆరోగ్య సమస్యలకు పరిష్కారాన్ని వెతకడం అధికమైంది. క్షణాల్లో వచ్చే సమాచారం ఆధారంగా తమకు ఈ కారణంగానే ఆరోగ్య సమస్య వచ్చిందని భావించి మెడికల్‌ షాపులకు వెళ్లి మందులు తీసుకుని వాడే వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది.

భౌతికంగాపరీక్షిస్తేనే..

మంచి పేరున్న వైద్యుని వద్దకు వందల కిలోమీటర్లు ప్రయాణించి రోగులు చికిత్స కోసం వెళ్తుంటారు. అలా వెళ్లిన వారు అవసరమైతే గంటల తరబడి క్యూలో ఉండి చికిత్స తీసుకుని వెళ్తుంటారు. ఫలానా డాక్టర్‌ చేయి తగిలితేనే(హస్తవాసి) సగం రోగం నయం అవుతుందన్న నమ్మకంతో ఉన్న వారూ ఉన్నారు. ఈ నమ్మకంతోనే ఇప్పటికీ చాలా మంది వారికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా నమ్ముకున్న వైద్యుల వద్దే చికిత్స తీసుకుంటారు. సదరు డాక్టర్‌ భౌతికంగా రోగిని పరిశీలించడమే గాక వారి యోగక్షేమాలు అడగడం, నవ్వుతూ మాట్లాడటం, ఏమీ కాదులే అని ధైర్యం చెప్పడంతో వారికి సగం రోగం నయమవుతుంది. కొందరు సీనియర్‌ వైద్యులు ఇప్పటికీ రోగిని భౌతికంగా ముట్టుకుని చేతులు, కాళ్లు కదిపి, పొట్టను ఒత్తి చూసి, నాడి పట్టుకుని పరీక్షించి వైద్యం చేస్తుంటారు. ఇలాంటివన్నీ ఆన్‌లైన్‌లో లభించవని పెద్దలు చెబుతుంటారు. ఎంతగా ఆన్‌లైన్‌ సేవలు అభివృద్ధిలోకి వచ్చినా మనిషిని చూసి వైద్యం ఇచ్చి ధైర్యం చెబితేనే తగ్గుతుందని వారు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement