
పేడ ఎరువుకు భలే గిరాకీ
కోడుమూరు రూరల్: పశువుల పేడ ఎరువుకు భారీగా డిమాండ్ నెలకొంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగుకు రైతులు భూములను ఎరువులు, ఇతర పోషకాలతో సారవంతం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు చాలామంది రైతులు పేడ ఎరువుపైనే ఆధారపడుతున్నారు. అయితే గ్రామాల్లో రైతుల అవసరాలకు తగినట్లుగా ప్రస్తుతం పేడ ఎరువు లభించని పరిస్థితి. పశుపోషణ భారమవడం, మేత దొరక్క చాలామంది రైతులు పశువుల పెంపకానికి స్వస్తి పలుకుతుండడంతో పేడ ఎరువుకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ట్రాక్టర్ పేడ ఎరువు రూ.6,500 నుంచి రూ.7వేలు పలుకుతోంది. ఒక ఎకరాకు 3 నుంచి 4 ట్రాక్టర్ల పేడ ఎరువు అవసరమవుతోంది. దీంతో స్థానికంగా పేడ ఎరువు లభించక చాలామంది రైతులు సుదూర ప్రాంతాల్లో ఉన్న పశువుల పెంపకందారుల నుంచి కొనుగోలు చేస్తున్నారు.
ట్రాక్టర్ ఎరువు ధర రూ.7 వేలు