
తిరోగమనంలో డీసీసీబీ
● నిరర్ధక ఆస్తులు రూ.195 కోట్ల నుంచి రూ.265 కోట్లకు పెరిగిన వైనం
కర్నూలు(అగ్రికల్చర్): గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో లాభాల బాట పట్టిన ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్రబ్యాంకు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తిరోగమనంలోకి పయనిస్తోంది. శుక్రవారం జాయింట్ కలెక్టర్, డీసీసీబీ అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జీ నవ్య అధ్యక్షతన బోర్డు సమావేశం జేసీ చాంబరుర్‌లో నిర్వహించారు. సమావేశంలో సీఇవో విజయకుమార్, జీఎం పి.రామాంజనేయులు, డీసీవో ఎన్.రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 2024–25 ఆడిట్ రిపోర్టులను జేసీ ఆమోదించారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన డీసీసీబీ వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో, అంటే 2022 నుంచి లాభాల బాట పట్టింది. లోనింగ్ పెంచడం, రికవరీలు పెరగడం వల్ల నిరర్థక ఆస్తులు తగ్గించుకొని నికర లాభాల్లోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత డీసీసీబీ పరిస్థితి తారుమారైంది. 2024–25లో లోనింగ్ పూర్తిగా పడిపోయింది. 2024 ఏప్రిల్ నెలలో డీసీసీబీ టర్నోవర్ రూ.3,930 కోట్లు ఉండగా.. నేడు కూడా టోర్నోవర్ అలాగే ఉంది. నిరర్థక ఆస్తులు మాత్రం భారీగా పెరిగిపోయాయి. 2024 ఏప్రిల్ నెలలో నిరర్థక ఆస్తులు రూ.195 కోట్లు ఉండగా.. నేడు రూ.265 కోట్లకు చేరుకోవడం గమనార్హం. డీసీసీబీకి 2022–23లో రూ.10 కోట్ల ఆదాయం రాగా రూ.4 కోట్లు పీఏసీఎస్‌లకు డివిడెండు రూపంలో పంపిణీ చేశారు. 2023–24లో రూ.4.50 కోట్ల లాభం వచ్చింది. 2024–25లో అతి కష్టం మీద డీసీసీబీకి రూ.1.20 కోట్ల ఆదాయం వచ్చినట్లు స్పష్టమైంది.
చిన్న సినిమాలను ఆదరించండి
ఆదోని టౌన్: చిన్న సినిమాలను ఆదరించాలని సినీ హీరో వీర్రాజు (చరణ్) విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ద్వారకా సినీ థియేటర్‌లో వీర్రాజు 1971 సినిమా రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భంగా సక్సెస్‌మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో పలు సినీ హీరోల అభిమాన సంఘాల నాయకులు, ప్రేక్షకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త విట్టా రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ హీరో వీర్రాజు మాట్లాడుతూ.. భారీ పెట్టుబడితో తీసే పెద్ద హీరోల సినిమాల మాదిరిగానే తక్కువ ఖర్చుతో తీస్తున్న చిన్న సినిమాలను పాఠకులు ఆదరించాలన్నారు. ద్వారకా థియేటర్‌లో శుక్రవారం వీర్రాజు సినిమా రిలీజైన సందర్భంగా పట్టణ ప్రముఖులు థియేటర్‌కు వెళ్లి సినిమాను వీక్షించారు. సినీ హీరో ఆదోని వాసి కావడం సంతోషకరమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.