
అసాంఘిక కార్యకలాపాలపై ‘స్పెషల్’ దాడులు
కర్నూలు: క్షేత్రస్థాయిలో అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తే స్పెషల్ టీమ్‌లను రంగంలోకి దింపి దాడులు చేయిస్తానని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో ఎస్పీ శుక్రవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. కర్నూలు, పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆదోని సబ్ డివిజన్లలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను సమీక్షించి పరిష్కారానికి సూచనలు చేశారు. స్టేషన్ల వారీగా కేసుల పెండింగ్‌కు కారణాలను అడిగి తెలుసుకున్నారు. డాబాల్లో మద్యం అనుమతించకుండా గట్టి చర్యలు చేపట్టాలని.. ఓపెన్ డ్రింకింగ్, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై గట్టి నిఘా ఉంచాలన్నారు. గ్రామాల పర్యటనకు వెళ్లినప్పుడు రోడ్డు ప్రమాదాల మలుపులు, ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించాలన్నారు. రేడియం స్టిక్కర్స్, బారికేడ్స్, బ్లింకర్స్, స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేయాలన్నారు. గత నెలలో నమోదైన కేసులను ఛేదించడంలో ప్రతిభ కనపరచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేశారు. డీఎస్పీలు బాబుప్రసాద్, ఉపేంద్ర బాబు, హేమలత, భాస్కర్ రావు, సీఐలు, ఎస్‌ఐలు సమావేశంలో పాల్గొన్నారు.

అసాంఘిక కార్యకలాపాలపై ‘స్పెషల్’ దాడులు