
కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తలు
కర్నూలు(హాస్పిటల్): కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు చెప్పారు. ఆయన శుక్రవారం తన చాంబర్‌లో కోవిడ్ వైరస్‌పై హెచ్‌ఓడీలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోవిడ్ వైరస్‌ను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన ప్రొటోకాల్ గురించి చర్చించామన్నారు. కోవిడ్ కేసుల దృష్ట్యా ఆసుపత్రిలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైరస్ పట్ల వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పల్మనాలజీ, అనస్తీషియా, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్, ఎమర్జెన్సీ మెడిసిన్, మైక్రోబయాలజీ ఫ్యాకల్టీతో కూడిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు రెడీ చేసుకోవాలని సంబంధిత హెచ్‌ఓడీలను ఆదేశించారు. పీపీఈ కిట్‌లకు సంబంధించి తగినంత స్టాక్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మాస్క్, పీపీఈ కిట్స్, యాంటీవైరల్ డ్రగ్స్, అత్యవసర ఔషధాలు అందుబాటులో ఉండేలా సర్జికల్ అండ్ మెడికల్ స్టోర్‌లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆక్సిజన్ పోర్ట్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అనస్తీషియా వైద్యులకు చెప్పారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, గతంలో మాదిరిగానే స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం, జనసమూహాలకు దూరంగా ఉండటం, కోవిడ్ వైరస్ సోకితే క్వారంటైన్‌లో ఉండటం చేయాలన్నారు. ఆసుపత్రి సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ బి.వెంకటేశ్వరరావు, వైద్యులు ఇక్బాల్ హుసేన్, విశాల, నాగలక్ష్మి, విజయలక్ష్మి, సుబ్రహ్మణ్యం, శారద, అడ్మినిస్ట్రేటర్ శివబాల నాగాంజన్, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.