
మాదకద్రవ్యాలను అరికడదాం
కర్నూలు(అర్బన్): జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో నషా ముక్త్ భారత్ అభియాన్ అమలుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 13–19 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలు మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు అధ్యయనాల్లో తేలినందుకు పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృత చేయాలన్నారు. సమావేశంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ రయీస్ ఫాతిమా, లీగల్ సెల్ అడ్వకేట్ హేమలత, మెప్మా పీడీ నాగశివలీల, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ శాంతికళ, ఐసీడీఎస్ పీడీ నిర్మల, డీఈఓ శామ్యూల్ పాల్, డీఎస్పీ బాబుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అవగాహన కార్యక్రమాలు ఇలా..
● జూన్ 1 నుంచి 7వ తేదీ వరకు విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
● జూన్ 8 నుంచి 14వ తేదీ వరకు వాల్ పెయింటింగ్స్, పోస్టర్లు వేయించాలన్నారు.
● జూన్ 15 నుంచి 21వ తేదీ వరకు చర్చలు, కాంపిటీషన్స్, సెమినార్లు, వెబినార్లతో అవగాహన కల్పించాలన్నారు.
● 22 నుంచి 26వ తేదీ వరకు అవగాహన ర్యాలీలు సంతకాల సేకరణ, బైక్ ర్యాలీలు చేపట్టాలన్నారు.
● 26న ప్రతి కార్యాలయంలో మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించాలన్నారు.
జూన్ 1 నుంచి 26వ తేదీ వరకు
అవగాహన కార్యక్రమాలు