
ప్రశాంతంగా ‘నీట్’
కర్నూలు సిటీ: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ఎన్‌టీఏ ఆదివారం నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ప్రశాంతంగా ముగిసింది. ఎన్‌టీఏ నిబంధనలను అనుసరిస్తూ విద్యార్థులను గంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతించారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించారు. మొత్తం 4,466 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు పేర్లు రిజిస్టర్ చేసుకోగా 4,381 మంది హాజరరుకాగా 85 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలకు రెండు గంటల ముందే విద్యార్థులు చేరుకున్నారు. ఎన్‌టీఏ నిబంధనల మేరకు ప్రతి ఒక్క విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. విద్యార్థినుల ముక్కు పుడకలు, చెవుల దిద్దులు, చేతుల గాజులు, ఆభరణాలను తీయించారు. పరీక్ష కేంద్రాల వెలుపల విద్యార్థులను మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేశారు. కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన నీట్ యూజీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తనిఖీ చేశారు. డీఆర్‌ఓ సి.వెంకట నారాయణమ్మ.. ప్రభుత్వ టౌన్ మోడల్ హైస్కూల్, టౌన్ మోడల్ జూనియర్ కాలేజీ, రాయలసీమ యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీ, ప్రభుత్వ ఐటీఐ బాలిక కాలేజీ(బి.తాండ్రపాడు)లలో ఏర్పాటు చేసిన కేంద్రాలను తనిఖీ చేశారు.
జిల్లాలో 16 పరీక్ష కేంద్రాల్లో
పరీక్ష నిర్వహణ
4,381 మంది హాజరు