హాయిగా నవ్వండి...! | - | Sakshi
Sakshi News home page

హాయిగా నవ్వండి...!

May 4 2025 6:18 AM | Updated on May 4 2025 6:18 AM

హాయిగ

హాయిగా నవ్వండి...!

ఒకప్పుడు నవ్వు నాలుగు విధాలా చేటు అనేవారు. ఇప్పుడు నవ్వడం భోగం.. నవ్వించడం యోగం.. నవ్వలేకపోవడం రోగం అంటున్నారు. నిత్యం సమస్యలతో సతమతమయ్యే వారిని మనసారా నవ్వుతూ పలకరిస్తే వారికి కొండంత బలం, ధైర్యం వస్తుంది. వ్యాధులతో బాధ పడేవారిని సైతం నవ్వించేందుకు ఇటీవల లాఫింగ్‌ క్లబ్‌లు కూడా ఏర్పాటయ్యాయి. అందులో నవ్వడం కూడా ఒక వ్యాయామంగా శిక్షణ ఇస్తున్నారు. అందుకే మే మొదటి ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం.

– కర్నూలు(హాస్పిటల్‌)

వరైనా ఫొటోలు దిగేటప్పుడు ఫొటోగ్రాఫర్‌ ‘స్మైల్‌ ప్లీజ్‌’ అంటుంటారు. నవ్వితే ముఖం మరింత అందంగా కనిపించి ఫొటో బాగా వస్తుందని వారి భావన. భావనే కాదు నిజం కూడా. మనం అద్దంలో చూసుకునేటప్పుడు ముఖాన్ని కోపంగా కంటే నవ్వుతూ చూస్తున్నప్పుడే ఎంతో అందంగా కనిపిస్తామన్నది అందరికీ తెలిసిందే. అందుకే శుభకార్యాల్లో బంధువులు, స్నేహితులు ఎవ్వరైనా కనిపిస్తే వెంటనే చిరునవ్వుతో పలకరిస్తాం. కేవలం ఫొటో కోసమే గాకుండా చిరునవ్వు జీవితమంతా కొనసాగిస్తే మరింత అద్భుతంగా ఉంటుందని మేధావులు సెలవిస్తున్నారు. నవ్వు ముఖ కవళికలపై, వారి భావోద్వేగాలపై ప్రభావం చూపుతాయని వారు పేర్కొంటున్నారు. నవ్వు ఒక మంచి అనుభూతే కాదు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వ్యాయామం కూడా. ఒత్తిడి నుంచి శారీరక, మానసిక బాధల నుంచి నవ్వు ఉపశమనం కలిగిస్తుంది. నవ్వడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.

నవ్వుతో మానసిక ఉల్లాసం

నవ్వవయ్య బాబూ నీ సొమ్మేం పోతుంది.. అనేది ఓ సినీగీతం. నిజమే నవ్వితే మీ సొమ్ము ఏమీ పోదు. నవ్వడానికి పైసా ఖర్చులేదు. ఎప్పుడైనా మనసారా నవ్వినప్పుడు మనలో కలిగే ఆనందం, ఆహ్లాదం అంతా ఇంతా కాదు. ఇటీవల సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో వెంకటేష్‌ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్‌ బ్లస్టర్‌ అయిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇతర సినిమాల్లో హింస ఎక్కువగా ఉండటం, ఇటీవల కాలంలో అన్నీ ఇలాంటి సినిమాలే రావడంతో జనం కామెడీకి దూరం అయ్యారు. ఇలాంటి సమయంలో వచ్చిన వెంకటేష్‌ సినిమాల్లో కావాల్సిన కామెడీ దక్కింది. అందుకే కుటుంబ సమేతంగా ఈ సినిమాను చూసి జనం ఎంజాయ్‌ చేశారు. ఇప్పటికీ టీవీ చానల్స్‌లో కొన్నింటిలో కేవలం కామెడీ సన్నివేశాలే ప్రదర్శిస్తూ ఉంటారు. రాత్రి నిద్రించే ముందు ఇలాంటి దృశ్యాలు చూస్తే ఆందోళన తగ్గి హాయిగా నిద్ర పడుతుందని వైద్యులు చెబుతున్నారు.

నవ్వులో ఆరోగ్య రహస్యాలు

చిరునవ్వుతో మానసిక, శారీరక ఉల్లాసం

పలు రకాల జబ్బులు దూరం

మానవ సంబంధాలు మెరుగు

నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవం

హాయిగా నవ్వితే మన శరీరంలో ఎండార్ఫిన్స్‌ విడుదలవుతాయి. నోట్లో చిగుళ్ల, దంతాల ఆరోగ్యం బాగుంటుంది. రక్తపోటు తగ్గుతుంది. మొహం వెలిగిపోతుంది. ముఖ కండరాలు బాగా పనిచేస్తాయి. నవ్వటానికి పదిహేను కండరాలు పనిచేస్తే.. మొహం చిట్లించడానికి దాదాపు 72 కండరాలు పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో ఏది మేలో మీరే తేల్చుకోవాలని వైద్యులు చెబుతున్నారు. నవ్వితే శరీరం మొత్తం రిలాక్స్‌ అవుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడి తగ్గి గుండెజబ్బుల నుంచి దూరం చేస్తుంది. వాటి రక్తప్రసరణ బాగై రక్తనాళాల పనితీరు మెరుగవుతుంది. హాయిగా రోజుకు 10 నుంచి 15 నిమిషాలు నవ్వడం వల్ల 40 క్యాలరీల వరకు ఖర్చువుతాయని వైద్యులు చెబుతున్నారు. ఎప్పుడూ నవ్వుతూ జీవించే వారి రక్తంలో ఆక్సీజన్‌ శాతం పెరిగి, జ్ఞాపకశక్తి ఇనుమడిస్తుందని, వారి ఆయుప్రమాణాలు కూడా పెరుగుతాయంటున్నారు. నవ్వు కోపాన్ని కూడా తగ్గించడమే గాక ఆందోళనను దూరం చేస్తుంది. లాఫింగ్‌ థెరపీతో క్యాన్సర్‌ జయించిన వాళ్లు ఎంతో మంది ఉన్నారని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రపంచం పట్ల(అంటే మనుషుల పట్ల) ప్రేమతో ఉంటూ, కనీసం ఒక్కర్నైనా నవ్వించాలని మనుషులకు సందేశం ఇచ్చాడు హార్వేబాల్‌. అయితే ఎదుటి వ్యక్తి బాధలో ఉన్నప్పుడు నవ్వితే మాత్రం ఇబ్బందులు తప్పవు. మనపై మనం జోకులు వేసుకుని నవ్వితే మేలు. ఇతరులపై జోకులు వేసి నవ్వితే కొన్నిసార్లు పరిస్థితులు వికటించవచ్చు.

నవ్వుతూ పలకరిస్తే దగ్గరవుతారు

సాధ్యమైనంత వరకు మన ముఖంలో చిరునవ్వు కనిపించాలి. అలాగని పనిచేయించాల్సిన చోట కూడా చిరునవ్వుతో ఉంటే జోకర్‌గా భావించి పనిచేసేవారు లెక్కచేయరు. ఇతరులతో స్నేహాన్ని కొనసాగించాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా నవ్వును మించిన ఆయుధం లేదు. మనసులో బాధలు ఎన్ని ఉన్నా చిరునవ్వుతో కనిపించాలి. అలాగుంటేనే అందరూ మన వద్దకు ధైర్యంగా వస్తారు.

– గోవిందు, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌, జీజీహెచ్‌, కర్నూలు

నవ్వు దేవుడిచ్చిన వరం

మనిషికి నవ్వడం ఆదేవుడిచ్చిన వరం. నవ్వడం వల్ల పాజిటివ్‌ థింకింగ్‌ అలవడతుంది. దీనివల్ల ఆరోగ్యంతో పాటు ఆయుష్షు పెరుగుతుంది. హాయిగా నవ్వుతూ ఉంటే అనారోగ్యాలు దరిచేరవు. చిరునవ్వుతో పలకరిస్తే ఎంతటి వారైనా ఫిదా కావాల్సిందే. నవ్వు, నడక, నడత, నమ్రత...ఈ నాలుగు ఉంటే మందులు అవసరం లేని ఆరోగ్యం మన సొంతం. తరచూ నవ్వుతూ ఉంటే ఆరోగ్యానికే మేలు.

–వాసుదేవరావు, మెడికల్‌ రెప్‌, కర్నూలు

హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి

కోపం, బాధపడటంతో పాటు నవ్వు కూడా ఒక భావోద్వేగం. నవ్వడం వల్ల మెదడులో కెరోటినిన్‌, డోపమైన్‌ అనే రసాయనాలు(హ్యాపీ హార్మోన్స్‌) విడుదలవుతాయి. దీంతో పాటు రిలాక్సేషన్‌ హార్మోన్లు కూడా విడుదలవుతాయి. ఈ కారణంగా శరీరంలో అన్ని వ్యవస్థలు కుదుటపడతాయి. మానసిక ఒత్తిళ్లు తగ్గిపోతాయి. కొన్నిరకాల మానసిక వ్యాధులూ తగ్గుతాయి.

–డాక్టర్‌ సరయురెడ్డి, జనరల్‌ ఫిజీషియన్‌, కర్నూలు

హాయిగా నవ్వండి...! 1
1/3

హాయిగా నవ్వండి...!

హాయిగా నవ్వండి...! 2
2/3

హాయిగా నవ్వండి...!

హాయిగా నవ్వండి...! 3
3/3

హాయిగా నవ్వండి...!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement