
హత్య కేసు నిందితులకు యావజ్జీవ జైలు శిక్ష
డోన్ టౌన్: ఓ వ్యక్తి హత్య కేసులో సాక్ష్యాలు రుజువు కావడంతో నిందితులకు యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ జిల్లా న్యాయమూర్తి కబర్ది తీర్పు వెలువరించారు. డోన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొట్రాయి పంచాయతీ పరిధిలోని మజరా గ్రామమైన ఎస్. గుండాలకు చెందిన బోయ గుడిమిరాళ్ల కౌలుట్ల (60) డోన్ రైల్వే స్టేషన్ సమీపంలో 2016 మే 15వ తేదీన దారుణహత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలో కొట్రాయి గ్రామానికి చెందిన మాదిగ నగేష్, అతని బంధువు గుమ్మకొండ గ్రామానికి చెందిన హరిజన నాయకంటి బాలమద్ది అలియాస్ కంకర బాలమద్ది రాయితో తలపై మోది హత్యకు పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఈ మేరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో ఇద్దరు నిందితులు హత్యకు పాల్పడినట్లు రుజువు కావడంతో గురువారం జిల్లా న్యాయమూర్తి కబర్ది యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.