ప్రశాంతంగా పాలిసెట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా పాలిసెట్‌

May 1 2025 1:13 AM | Updated on May 1 2025 1:13 AM

ప్రశా

ప్రశాంతంగా పాలిసెట్‌

కర్నూలు సిటీ: పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్‌–2025 బుధవారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించిన పరీక్షకు కర్నూలు నగరంలో 12 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 4,595 మంది విద్యార్థులకుగాను 4,003 మంది హాజరయ్యారు. ఆదోనిలో ఏర్పాటు చేసిన 10 కేంద్రాల్లో 2,771 మందికి గాను 1,660 మంది హాజరయ్యారు. జిల్లా కో–ఆర్డినేటర్‌గా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ ఫర్‌ మైనార్టీ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఓ. శ్రీధర్‌, జిల్లా పరిశీలకులుగా స్టేట్‌ బోర్డు ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఏపీ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ నాగేశ్వరరావు, టౌన్‌ అబ్జర్వర్‌గా టి.శ్రీనివాసులు వ్యవహరించారు. వీరు పలు కేంద్రాలను తనిఖీ చేశారు.

రానున్న మూడు రోజుల్లో అకాల వర్షాలు

కర్నూలు(అగ్రికల్చర్‌): రానున్న మూడు రోజుల్లో ఉమ్మడి జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకవైపు వడగాల్పులు, మరోవైపు ఉరుములు, మెరుపులు, పిడుగులు, అకాల వర్షాల కురిసే అవకాశం ఉంది. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉన్నట్లు పేర్కొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు, వడగాల్పులు, సాయంత్రం నుంచి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

గిరిజన గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కర్నూలు(అర్బన్‌): జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకులాల్లో 3వ తరగతి ప్రవేశాలతో పాటు 4 నుంచి 9వ తరగతి వరకు మిగిలిన సీట్లలో ప్రవేశానికి గిరిజన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి కె.తులసీదేవి బుధవారం ఒక ప్రకటనలో కోరారు. గిరిజన సంక్షేమ గురుకులాలు బాలికలకు కర్నూలు, ఆలూరు, బాలురకు తుగ్గలిలో ఉన్నాయన్నారు. ఈ మూడు గురుకులాల్లో 3వ తరగతి ప్రవేశాలకు మొత్తం 120 సీట్లు ఉన్నాయన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 1 నుంచి 20వ తేదీలోగా ఆయా పాఠశాలల్లోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 30న కర్నూలు బిర్లాగేట్‌ సమీపంలోని గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయంలో లాటరీ పద్ధతిన సీట్లు కేటాయిస్తామన్నారు.

నీట్‌ యూజీ–2025కు హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు

కర్నూలు కల్చరల్‌: ఈనెల 4వ తేదీన నిర్వహిస్తున్న నీట్‌ యూజీ–2025 పరీక్ష సందర్భంగా హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా తెలిపారు. పరీక్షకు సంబంధించి ఏవైనా సమస్యలు, ఇబ్బందులు, సందేహాలు ఉన్నా నివృత్తి కోసం హెల్ప్‌ డెస్క్‌ నెంబర్‌ 08518 277305కు ఫోన్‌ చేయవచ్చన్నారు. మే 3, 4 తేదీలు రెండు రోజులు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు హెల్ప్‌ డెస్క్‌ అందుబాటులో ఉంటుందన్నారు.

ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ ర్యాంపులు

కర్నూలు(హాస్పిటల్‌): ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ ర్యాంపులు ఉండేలా చర్యలు చేపడతామని డీఆర్‌ఓ సి.వెంకట నారాయణమ్మ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లా స్థాయి వైకల్య కమిటీ సమావేశాన్ని సంబంధిత అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో శారీరక వికలాంగులకు ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డుల మంజూరు దరఖాస్తులు చాలా పెండింగ్‌లో ఉన్నాయని సభ్యులు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. వాటిని వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా స్థాయి వైకల్య కమిటీ సమావేశాన్ని ఆరు నెలలకు ఒకసారి నిర్వహించేలా చూస్తామన్నారు. సభ్యులు తన దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను పరిశీలించి కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ సీఈఓ నాసరరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్‌, విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు రాయిస్‌ ఫాతిమా, ఎల్‌డీఎం రామచంద్రరావు పాల్గొన్నారు.

ప్రశాంతంగా పాలిసెట్‌ 1
1/1

ప్రశాంతంగా పాలిసెట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement