పెద్దాయనా.. మన్నించు ! | - | Sakshi
Sakshi News home page

పెద్దాయనా.. మన్నించు !

Mar 20 2025 1:55 AM | Updated on Mar 20 2025 1:49 AM

సంజీవయ్య జయంతి ఉత్సవాలకు రూ.3 లక్షలు
● ఫిబ్రవరి 14న ఘనంగా నిర్వహించిన జిల్లా అధికార యంత్రాంగం ● నేటికీ నయాపైసా విదల్చని ప్రభుత్వం

కర్నూలు(అర్బన్‌): దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి నిర్వహణకు సంబంధించిన వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేటికీ విడుదల చేయకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంజీవయ్య సొంత జిల్లా అయిన కర్నూలులో ఆయన జయంతిని అంగరంగ వైభవంగా అధికారికంగా రాష్ట్ర స్థాయి పండుగ నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే స్టేట్‌ హెడ్‌ క్వార్టర్స్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.లక్ష, సంజీవయ్య సొంత జిల్లా కర్నూలుకు రూ.3 లక్షల నిధులు కేటాయిస్తున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరి 10న రాష్ట్ర ప్రభుత్వం జీఓ 2 విడుదల చేసింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం స్థానిక నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో దామో దరం సంజీవయ్య విగ్రహం ఉన్న ప్రాంతంలో జయంతి వేడుకలను ఫిబ్రవరి 14న ఘనంగా నిర్వహించారు. నేడో రేపో నిధులు విడుదలైన వెంటనే చెల్లించవచ్చనే ధైర్యంతో సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన పలువురు అధికారులు సప్లయర్స్‌ షాపు, పూల దుకాణాలు, కిరాణ తదితర షాపుల్లో అప్పులు చేసి జయంతిని ఘనంగా చేశారు. జయంతి నిర్వహించి నెల రోజులు గడచిపోయినా, ప్రభుత్వం నుంచి నేటికీ నయాపైసా విడుదల కాకపోవడంతో అప్పులు ఇచ్చిన షాపుల వారికి ముఖాలు చూపించలేక, అపద్దాలు చెప్పలేక పలువురు అధికారులు ముఖం చాటేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా షాపుల యజమానులు సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement