● చూసీచూనడట్లు వదిలేస్తున్న రెవెన్యూ అధికారులు
రుద్రవరం: మండలంలో మట్టి అక్రమ తవ్వకాలు ఆగడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాగులు, వంకలు, లే అవుట్లలో యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తుండటంతో అక్రమార్కులది అడిందే ఆట పాడిందే పాటలా తయారైంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొందరి నుంచి భూమిని కొనుగోలు చేసి పేదల కోసం కేటాయించింది. అప్పటి ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి కొంత మంది పేదలకు ఇళ్ల స్థలాలు కూడా పంపిణీ చేశారు. లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేలోపే ప్రభుత్వం మారడంతో అంతా తలకిందులైంది. ఆ భూమిలో ఇప్పుడు కూటమి నేతలు ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు సాగిస్తున్నారు. లబ్ధిదారులు అడ్డుకునేందుకు వెళ్లగా తమ పూర్వికుల భూమి అని, తమకు పూర్తి హక్కులు ఉన్నాయని గదమాయిస్తున్నారు. చేసేదేమీ లేక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకునే నాథుడే లేరు. మంగళవారం పేరూరు సమీపంలోని వక్కిలేరులో మట్టిని తవ్వి ట్రాక్టర్లలో ఆళ్లగడ్డ, శిరివెళ్ల మండలాల్లోని బత్తలూరు, ఎర్రగుంట్ల గ్రామాలకు తరలిస్తున్నండగా స్థానికులు సంబంధిత వీఆర్వోకు సమాచారం ఇచ్చారు. ఆయన అక్కడికి చేరుకుని మట్టి తవ్వకాలు నిలిపేయాలని చెబుతూనే స్థానికులు వెళ్లిపోయిన తర్వాత తిరిగి తవ్వేకోవచ్చన్న సంకేతాలు ఇచ్చి వెళ్లినట్లు సమాచారం. దీంతో కూటమి నేతలు తిరిగి జేసీబీతో వాగులోని మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా వేర్వేరు గ్రామాలకు తరలించారు. మట్టి తవ్వకాలపై తహసీల్దారు మల్లికార్జునరావును వివరణ కోరగా తాము ఎవ్వరికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పుకోచ్చారు.
ఆగని మట్టి అక్రమ తవ్వకాలు