పద్మనాభ తీర్థుల బృందావనానికి హారతులు పడుతున్న పీఠాధిపతి
మంత్రాలయం: మధ్వమత పూర్వపు పీఠాధిపతి పద్మనాభతీర్థుల 700వ ఆరాధన వేడుకలు వైభవంగా జరిగాయి. కర్ణాటకలోని అనేగొంది నవబృందావన క్షేత్రంలో శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల చేతుల మీదుగా వేడుకలు నిర్వహించారు. ఆరాధనోత్సవాల్లో భాగంగా ఆదివారం పూర్వరాధన వేడుక గావించారు. ముందుగా పద్మనాభతీర్థుల మూలబృందావనానికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేపట్టి విశేష అలంకరణలు చేశారు. పండితుల మంత్రోచ్ఛణాల మధ్య పూర్వారాధన కనుల పండువగా సాగింది. అనంతరం మూలరామ దేవుళ్ల సంస్థాన పూజలు కానిచ్చి భక్తులకు ముద్రధారణ, తీర్థ ప్రసాద వితరణ చేపట్టారు.
నేడు కలెక్టరేట్‌లో స్పందన
కర్నూలు(సెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందనలో భాగంగా సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రజల నుంచి వినతులను స్వీకరించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి.సృజన ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతోపాటు అన్ని మండల, డివిజన్, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా స్పందన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
ఇండస్ట్రియల్ హబ్‌గా ఓర్వకల్లు
● ఐలా చైర్మన్ జీఆర్‌కే రెడ్డి
కర్నూలు (టౌన్): రాష్ట్ర ప్రభుత్వం ఓర్వకల్లును ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ కార్పొరేషన్(ఏపీఐఐసీ), ఇండస్ట్రియల్ లోకల్ ఏరియా అథారిటీ (ఐలా) చైర్మన్ జీఆర్‌కే రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగ సమస్య పరిష్కరించడంతో పాటు వేలాది ఉద్యోగాల కల్పనలో భాగంగా ప్రభుత్వం ఓర్వకల్లును అభివృద్ధి చేస్తోందన్నారు. ఏవైనా పరిశ్రమలు రావాలంటే నీరు ముఖ్యమని, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రత్యేక చొరవతో ముచ్చుమర్రి నుంచి పైపులైన్ ద్వారా నీటిని కేటాయించడం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శమన్నారు. యువత పారిశ్రామిక రంగం వైపు అడుగులు వేయాలన్నారు. ప్రభుత్వం నుంచి నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి కల్పించడం, జిల్లాలో డ్రైపోర్ట్, పారిశ్రామిక వాడల అభివృద్ధిలో తగిన చర్యలు తీసుకోవాలన్నారు. స్వతహాగా పారిశ్రామిక వేత్తగా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కమిటీ మెంబర్‌గా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జోనల్ కమిటీ మెంబర్‌గా తాను తీసుకెళ్లిన సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం శుభపరిణామమన్నారు.


