నగరాలుపై చిన్నచూపు | - | Sakshi
Sakshi News home page

నగరాలుపై చిన్నచూపు

Sep 18 2026 2:21 AM | Updated on Sep 18 2026 2:21 AM

నగరాలు కులస్తులను అడుగడుగునా అవమానిస్తున్న కూటమి నేతలు తమ కార్పొరేషన్‌కు చైర్మన్‌ను నియమించాలని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బాబ్జీ నిరవధిక దీక్ష దీక్ష ఐదు రోజులు దాటినా స్పందించని కూటమి పాలకులు విజయవాడ మేయర్‌, దుర్గగుడి చైర్మన్‌ పదవులిచ్చి గౌరవించిన వైఎస్‌ జగన్‌

అడుగడుగునా అవమానిస్తున్న కూటమి నేతలు

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): తమను కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని నగరాలు సామా జికవర్గం వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో నాలుగైదు నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న తమకు కనీస మార్యాద ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తరువాత తమను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో ఎంపీ, ఎమ్మెల్యేలు సైతం తమతో దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.

11 నెలలుగా కార్పొరేషన్‌కు చైర్మన్‌ లేని దుస్థితి

ఆంధ్రప్రదేశ్‌ నగరాలు అభివృద్ధి, సంక్షేమ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా ఉన్న మరుపిళ్ల తిరుమలేష్‌ 11 మాసాల క్రితం మృతి చెందారు. ప్రమాణ స్వీకారం చేసిన కేవలం నెల రోజుల్లోపే ఆయన మృతి చెందారు. అప్పటి నుంచి ఆ పదవిలో ఎవరినీ నియమించలేదు. అయితే కార్పొరేషన్‌ డైరెక్టర్లు కొనసాగుతున్నారు. చైర్మన్‌ లేకుండా డైరెక్టర్లు ఉన్నప్పటికీ తమకు ఎటువంటి ప్రయోజనం చేకూరటం లేదని నగరాలు సంఘ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అనేక మార్లు స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా కూటమి పాలకులకు విషయాన్ని వివరించినా స్పందించటం లేదని వాపోయారు.

నిరవధిక దీక్షలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బాబ్జీ

ఏపీ నగరాలు అభివృద్ధి, సంక్షేమ కార్పొరేషన్‌కు చైర్మన్‌ను నియమించాలని, తద్వారా ప్రభుత్వానికి తమ బాధలు చెప్పుకొనే అవకాశం కల్పించాలని కోరుతూ ఏపీ నగరాలు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాయన బాబూజీ (బాబ్జీ) ఈ నెల 13వ తేదీన నిరవధిక నిరాహారదీక్షకు దిగారు. ఐదు రోజులుగా దీక్ష చేస్తున్నప్పటికీ కూటమికి చెందిన ప్రజాప్రతినిధులు ఎవరూ స్పందించటం లేదు. దీక్షాస్థలం చుట్టుపక్కలే ఎంపీ, ఎమ్మెల్యేలు పర్యటిస్తున్నప్పటికీ ఆయనను పలకరించకపోవటంపై ఆ సంఘ నేతలు మండిపడుతున్నారు. ‘ఇదేనా ఓట్లు వేసి గెలిపించిన నగరాలుకు ఇచ్చే గౌరవం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నగరాలకు అండగా ఉన్న వైఎస్‌ కుటుంబం

రాష్ట్రంలో నగరాలు సంఘీయులకు మొదటి నుంచి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబం అండగా నిలిచింది. గతంలో ఓసీలుగా ఉన్న నగరాలును వైఎస్‌ రాజ శేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీల్లో చేర్చారు. ఉమ్మడి రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌ వంటి ప్రాంతాల్లో బీసీ హోదాకు అర్హత కల్పించారు. దీంతో ఆ సామాజికవర్గానికి చెందిన వందలాది మంది డాక్టర్లుగా, ఇంజినీర్‌లుగా, ఇతర ఉన్నత చదువుల్లో రాణించి అనేక ఉన్నత స్థాయిలకు చేరుకున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న నగరాలను బీసీలుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి సారిగా ఏపీ నగరాలు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. రాజకీయ రాజధానిగా ఉన్న విజయవాడలో మేయర్‌గా ఆ సామాజిక వర్గానికి చెందిన రాయన భాగ్యలక్ష్మికి అవకాశం కల్పించారు. రాష్ట్రంలో రెండో అతి పెద్ద ఆలయంగా ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి నగరాలు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని చైర్మన్‌గా నియమించారు. రాష్ట్రంలోని వివిధ ప్రధాన ఆలయాల్లో సభ్యులుగా నియమించారు. శ్రీశైలంలో ఆ సామాజికవర్గానికి ప్రత్యేకంగా స్థలాన్ని సైతం కేటాయించి గౌరవించారు.

తమను కూటమి నేతలు అడుగడుగునా అవమానిస్తున్నారని నగరాలు సంఘీయులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఎంపీ కార్యాలయానికి వెళ్లిన తమ సంఘ నేతలను కనీసంలోపలకు రమ్మని సైతం ఆహ్వానించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల తరువాత ఆ సామాజికవర్గానికి చెందిన ఆలయ కమిటీ ప్రముఖులు ఒక సమస్య పరిష్కారానికి పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లిన సందర్భంలో ‘మీకు ఎలక్షన్‌లో ఎంత ఇచ్చాం?’ అంటూ కార్యాలయం బాధ్యుడు ప్రశ్నించగా, ‘ఎవరికీ ఇచ్చారు? ఎందుకిచ్చారో చెప్పాలి’ అంటూ నాయకులు ఆ కార్యాలయ బాధ్యుడిని తిరిగి ప్రశ్నించిన వైనం హల్‌చల్‌ అయ్యింది. అటు ఎంపీ, ఇటు ఎమ్మెల్యే ఇద్దరూ తమను అడుగడుగునా కించపరుస్తున్నారంటూ ఆ సంఘీయులు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement