కంకిపాడు: మొన్నటి వరకూ ఉయ్యూరు, కంకిపాడు మండలాలను డయేరియా కుదిపేసింది. పదుల సంఖ్యలో రోగులు ఆస్పత్రుల బారిన పడ్డారు. తాజాగా కంకిపాడు మండలం ఉప్పలూరులో డయేరియా వ్యాప్తి చెందింది. అతిసార లక్షణాలతో పలువురు ఆస్పత్రుల్లో చేరుతుండటం కలకలం రేపు తోంది. విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తమయ్యారు.
ఉప్పలూరులో ఆందోళన
ఉప్పలూరులో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నెల 16వ తేదీన ఇద్దరు, గురువారం ఒకరు స్థానిక పీహెచ్సీలో అతిసార లక్షణాలతో వైద్యం కోసం చేరారు. ప్రస్తుతం ఒక చిన్నారికి వైద్య సిబ్బంది వైద్యం అందిస్తున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో అతిసార లక్షణాలతో పాటుగా తీవ్ర అనారోగ్య కారణాలతో కాండ్రు జోజిబాబు (40) బుధవారం రాత్రి మృతి చెందాడు. చిన్న పేగులు ఇన్ఫెక్షన్కు గురై ఆరోగ్యం విషమించి అతను మృతి చెందాడని వైద్యులు చెబుతున్నారు. మరొకరు విజయవాడలోనే వైద్యం పొందుతున్నారు. గ్రామంలోని ఎస్సీ కాలనీ, జగనన్న కాలనీల్లో ఈ కేసులు నమోదయ్యాయి. అయితే ఆర్ఎంపీల వద్ద వైద్యం పొందుతున్న వారు కూడా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. వాంతులు, విరేచనాల లక్షణాలతోనే కాకుండా జ్వరపీడితులు ఆర్ఎంపీల వద్దే వైద్యం తీసుకుంటున్నట్లు సమాచారం.
అప్రమత్తమైన వైద్య సిబ్బంది
అతిసార లక్షణాలు గుర్తించటంతో వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తయ్యారు. ముందుగా కేసులు నమోదైన ఎస్సీ కాలనీ, జగనన్న కాలనీల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఇటీవలే తాగునీటి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు తరలించామని, ఎలాంటి సమస్య తలెత్తలేదని వైద్య, ఆరోగ్య సిబ్బంది ఒకరు సాక్షికి చెప్పారు. అతిసార లక్షణాలు వ్యాప్తి చెందటానికి గల కారణాలు తెలియడం లేదని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.
నివారణ చర్యలు ఏవీ?
పెనమలూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో డయేరియా ప్రబలడంతో ప్రజలు ఆందోళన చెందు తున్నారు. మొదట ఉయ్యూరు పట్టణం, ఆ తరువాత ఉయ్యూరు మండలంలో డయేరియా వ్యాప్తి చెందింది. డయేరియా లక్షణాలతో ముగ్గురు మృతి చెందినప్పటికీ అధికారులు ధ్రువీకరించలేదు. కంకిపాడు పట్టణంతో పాటు మండలంలోని పునాదిపాడు, ప్రొద్దుటూరు, కోలవెన్ను, కోమటిగుంట గ్రామాల్లో డయేరియా కేసులు నమోదయ్యాయి. అధికారంగానే 40 మందికి పైగా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. రాజస్థాన్ నుంచి కంకిపాడుకు వలస వచ్చిన బాలుడు (6) అతిసార లక్షణాలతో మృతి చెందాడు. పరిస్థితి అదుపులోకి వచ్చిందనే లోపు ఉప్పలూరులో మూడు డయేరియా కేసులు నమోదయ్యాయి. అసలు డయేరియా వ్యాప్తి చెందటానికి గల కారణాలు మాత్రం అధికారులు తేల్చటం లేదు. తాగునీరు, లేదా కలుషిత ఆహారం కారణం అయ్యి ఉండొచ్చని చెబుతున్నారే కానీ అసలు కారణాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.


