చిలకలపూడి (మచిలీపట్నం): కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో విశ్వ కర్మ చిత్రపటానికి కలెక్టర్ డి.కె.బాలాజీ పుష్పాంజలి ఘటించారు. విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. శిల్పకళ, నిర్మాణ రంగం, సాంకేతిక నైపుణ్యా లతో సమాజాభివృద్ధికి సేవలు అందిస్తున్న వృత్తి నిపుణులు, కార్మికులు, శిల్పులు, కళాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంప్రదాయంలో విశ్వకర్మ సృష్టికర్తగా, శిల్ప కళకు ఆద్యుడిగా భావిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో కె.శ్రీధర్‌రెడ్డి, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖాధికారి జి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): తమకు న్యాయ పరంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు వెంటనే చెల్లించాలని, పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ వైద్యులు చేపట్టిన నిరసన గురువారం కూడా కొనసా గింది. ప్రభుత్వ వైద్యుల సంఘం – ఆంధ్రప్రదేశ్ (జీడీఏ–ఏపీ) ఆధ్వర్యంలో 17 రోజులుగా వైద్యులు రోజూ ఉదయం తొమ్మిది నుంచి 9.30 వరకూ విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం తక్షణమే 2016 యూజీసీ పీఆర్‌సీ బకాయిలు టీచింగ్ వైద్యులకు చెల్లించాలని కోరుతున్నారు. ఇప్పటికే 30 సార్లు విన్నపాలు చేసినా, ప్రభుత్వం నుంచి స్పందన కొరవడిందన్నారు. తాము పనిచేసిన కాలానికి అనుగుణంగా పీఆర్‌సీ బకాయిలు ఇవ్వమని వినతి అందజేస్తే ఇవ్వడం కుదరదని ప్రభుత్వం చెప్పడం బాధాకరమని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఐ బాబ్జి శ్యామ్‌కుమార్ అన్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే, విజయవాడ డివిజన్ వ్యాప్తంగా రైల్వేస్టేషన్‌లు, కార్యాలయాలలో పరిశుభ్రత, సుస్థిర వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తూ గురువారం స్వచ్ఛత కార్యక్ర మాలు నిర్వహించారు. విజయవాడ డీఆర్‌ఎం కార్యాలయం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా పాల్గొని అధికారులు, ఉద్యోగులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా మాట్లాడుతూ.. పరిశుభ్రత అనేది కేవలం రైల్వే పరిపాలన బాధ్యత మాత్రమే కాదని, ప్రతి రైల్వే ఉద్యోగి, ప్రయాణికుడు చేయాల్సిన నిరంతర పక్రియ అని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు, సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయం తరఫున గురువారం పట్టు వస్త్రాలను సమర్పించారు. స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించేందుకు కాణిపాకం వెళ్లిన దుర్గగుడి చైర్మన్, ఈఓ శీనానాయక్‌తో పాటు ఆలయ ప్రధాన అర్చకుడు ఎల్.దుర్గాప్రసాద్ తదితరులకు కాణిపాకం ఆలయ ఈఓ పెంచల కిషోర్‌కుమార్ స్వాగతం పలికారు. అనంతరం దుర్గ గుడి అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు.


